● రక్తంతో అపురూప చిత్రాలు
● కానుకలు ఇచ్చేందుకు సిరిసిల్ల యువత ఆసక్తి
సిరిసిల్ల అర్బన్: పెన్సిల్ ఆర్ట్.. వాటర్‌కలర్స్ ఆర్ట్.. చూశాం. కానీ సిరిసిల్లలో ఇటీవల బ్లడ్ ఆర్ట్ ఫేమస్ అయ్యింది. తమ ఆప్తులకు.. అత్యంత ఇష్టమైన వారి పుట్టిన రోజులు.. పెళ్లిరోజులకు కానుకలు ఇచ్చేందుకు చాలా మంది ఈ బ్లడ్ ఆర్ట్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. సిరిసిల్లకు చెందిన వెంగళ గణేశ్ అనే చిత్రకారుడు సామాజిక రుగ్మతలపై అనేక చిత్రాలు గీశారు. ఎయిడ్స్ నిర్మూలన, కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, పిల్లల విక్రయాలు, నేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలు వివిధ అంశాలపై ఆలోచన రేకేత్తించే చిత్రాలు తన కలం నుంచి జాలువారాయి. ఈక్రమంలోనే కొంతకాలంగా రంగుల స్థానంలో రక్తం వచ్చింది. కొన్ని చుక్కల రక్తంతో మంచి చిత్రాన్ని గీసి ఇస్తున్నాడు.
రక్తంతో చిత్రాలు
తమకు ఇష్టమైన వారికి కానుక ఇచ్చేందుకు చాలా మంది ఈ రక్తంతో గీసిన(బ్లడ్ ఆర్ట్) చిత్రాలు ఇస్తున్నారు. తమ రక్తాన్ని ల్యాబరేటరీకి వెళ్లి సిరంజీలో తీసుకొని వచ్చి గణేశ్‌కు ఇస్తే.. మనం ఎవరి చిత్రం కావాలంటే వారిది గీసి.. ఫొటోఫ్రేమ్ చేసి ఇస్తాడు. ఇలా రెండేళ్లుగా బ్లడ్ ఆర్ట్ వేస్తున్నాడు. రెండేళ్లలో 360 వరకు చిత్రాల వేసినట్లు తెలిపాడు.
రక్తం సేకరణలో భద్రతపై ఆందోళన?
ప్రధానంగా 2023లో తమిళనాడులో ఈ తరహా బ్లబ్ ఆర్ట్ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. అయితే రక్తం సేకరణలో భద్రత ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తం కావడంతో అక్కడి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తోంది.
ప్రేమ అంటే అండగా ఉండటం
తల్లిదండ్రులు, ఆప్తులపై ప్రేమ ఉంటే వారితో సమయం గడపడం, వృద్ధాప్యంలో అండగా నిలవడం చేయాలని.. ఇలా రక్తంతో వేసిన చిత్రాలు అంతకంటే విలువైనవి కాదని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రక్తం సేకరణ విషయంలో శిక్షణ లేని వ్యక్తులు, అనుమతి లేని ల్యాబ్‌లకు వెళ్లడం ప్రమాదకరమని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


