● ‘దక్కన్ సర్కార్’ సినిమా దర్శకుడు కళా శ్రీనివాస్
గంభీరావుపేట(సిరిసిల్ల): తెలంగాణ నేల కథను, అచ్చమైన యాస, ఉద్యమ స్ఫూర్తిని తెరపై ఆవిష్కరించామని ‘దక్కన్ సర్కార్’ సినిమా దర్శకుడు, గాయకుడు కళా శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని సీతారామస్వామిని బుధవారం దర్శించసందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన శ్రీనివాస్ దాదాపు 3వేల ఆల్బమ్ సాంగ్స్, 20కి పైగా షార్ట్ ఫిలిమ్స్, 50కిపైగా డాక్యుమెంటరీ ఫిలిమ్స్, వెయ్యికిపైగా స్టేజీ షోలు నిర్వహించాడు. కళా శ్రీనివాస్ నిర్మాతగా, దర్శకుడిగా మారి తెలంగాణ ఉద్యమ నేపథ్యం, సామాజిక పరిస్థితులు, గ్రామీణ ప్రజల స్థితిగతులు, సహజ సంఘటనల ఆధారంగా ‘దక్కన్ సర్కార్’ అనే సినిమాను రూపొందించారు. రెండేళ్ల కష్టంతో సినిమా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమా సెన్సార్ బోర్డు పరిధిలో ఉందన్నారు. డిసెంబర్ నెలలో థియేటర్‌లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలోని అంశాలు ఆయన మాటల్లోనే..
తెలంగాణ కథ
తెలంగాణ ఉద్యమంలో 300 స్టేజీల్లో కళా ప్రదర్శనలు ఇచ్చాను. దాదాపు 30 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలోని పల్లెల్లో తిరిగాను. ప్రజల జీవన విధానం, వారి కష్ట సుఖాలు పరిశీలించాను. సామాజిక, రాజకీయ పరిస్థితులూ గమనించాను. తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు దక్కన్ ప్రాంతంగా పిలిచేవారు. దక్కన్ పేరుతో అనేకాంశాలు ఉన్నాయి. ఈ అంశాలపై తీసిన మూవీ కాబట్టి దక్కన్ సర్కార్ అని పేరు పెట్టాం.
పైసల్లేక షూటింగ్ ఆగింది
నేను రచయితను.. గాయకున్ని. సామాన్య పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. సహజంగానే ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. అప్పుడప్పుడు పైసల్లేక షూటింగ్ ఆపిన సందర్భాలు ఉన్నాయి. హీరో చాణక్య ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి. తనని కొన్ని నెలలపాటు తెలంగాణలోని అనేక గ్రామాల్లోకి తీసుకెళ్లాను. వారి యాస, భాషను పరిచయం చేశాను. సినిమా హీరో పాత్రకు అనుగుణంగా మార్చాను.
వంద మంది నటీనటులతో షూటింగ్
సినిమాలో దాదాపు 100 మంది నటీనటులు పనిచేశారు. మరో 50 మంది సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. నేను షార్ట్ ఫిలిమ్స్, స్టేజీ షోలు చేసిన అనుభవం ఉన్నందున సమన్వయం చేసుకోగలిగాను.
ప్రశ్నించేతత్వం చెప్పాం
ఈ సినిమా ద్వారా యువతకు మంచి సందేశం ఇచ్చాం. గ్రామాలు, పట్టణాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయాల్లో యువకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.. వాటిని ఎలా ప్రశ్నించాలి, పరిష్కరించుకోవాలో సినిమాలో చూపించాం.


