● సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీ కేసు ఛేదన ● పూర్తిస్థాయిలో ఆభరణాల రికవరీ ● పోలీసుల పనితీరుకు అభినందనలు
మంథని: చేతికందిన సొమ్ము కాదు.. భవిష్యత్‌కు భరోసా కోసం దాచుకున్న బంగారం ఒక్కరాత్రిలోనే చోరీకి గురవడంతో ఆ కుటుంబం మనోవేదనకు గురైంది. వారి ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులను గుర్తించారు. సొత్తును పూర్తిస్థాయిలో రికవరీ చేశారు. వివరాలు.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో ఈనెల 18న పంగ శ్రీకాంత్ ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు సుమారు రూ,7 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీచేశారు. దీనిపై ఈనెల 19న సాక్షి దినపత్రిలో ‘ఉన్నదంతా ఊడ్చేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. బాధితుడి ఆడబిడ్డ దాచుకున్న ఆభరణంతోపాటు కూతురు, కుమారుడి కానుకలూ చోరీకి గురైనవాటిలో ఉన్నాయి.
భరోసా ఇచ్చారు.. మాట నిలబెట్టుకున్నారు
సమాచారం అందిన వెంటనే రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు సీఐ స్వామి నేతృత్వంలో ఎస్‌ఐ సందీప్‌కుమార్, కానిస్టేబుల్లు రమేశ్, శివకుమార్ మరికొందరు పోలీసులు వేగవంతంగా దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తూ నిందితుల కదలికలను గుర్తించి మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారినుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగిన కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసుల పనితీరును ప్రజలు అభినందించారు.


