కరీంనగర్ క్రైం: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలపతిరావు శుక్రవారం వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌కు వచ్చారు. ఆయన్ను ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కరీంనగర్ బార్ అసో సియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్, సీహెచ్.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సీనియర్ న్యాయవాది కుసుంబా కృష్ణారావు, బ్రాహ్మణ సంఘం నేతలు శాలువ, బొకేలతో సత్కరించారు. చలపతిరావు మాట్లాడుతూ కోర్టుల్లో బార్ అండ్ బెంచ్ సమన్వయంతో కేసులు త్వరితగతిన పరిష్కారమై, కక్షిదారులకు త్వరగా న్యాయం జరుగుతుందన్నారు. ప్రొటోకాల్ న్యాయమూర్తి చిరాగ్ మెహతా, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పెంచాల ప్రభాకర్‌రావు, తుమ్మనపెల్లి లక్ష్మణ్ రావు, విక్రమ్‌రెడ్డి, పెంచాల లక్మణ్ రావు, గంజి స్వరాజ్ బాబు, ఎం.సత్యనారాయణ ఉన్నారు.
శాస్త్రోక్తంగా ఉపాకర్మ
కరీంనగర్ కల్చరల్: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం సౌజన్యంతో శ్రీ గణేశ శారదా శంకరాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉపాకర్మ, మౌంజీ విప్పు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎం.రత్నాకర్ శర్మ బృందం ఆధ్వర్యంలో హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు వటువులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంక్షేమ క్లెయిమ్‌ల్లో అవకతవకలు.. ఏసీపై వేటు
కరీంనగర్‌టౌన్: తెలంగాణ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు క్లెయిమ్‌ల పరిశీలన, ధ్రువీకరణ, ప్రాసెసింగ్‌లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటు న్న కరీంనగర్ సహాయ కార్మిక కమిషనర్ (ఏసీ) ఎస్.వెంకటరమణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రత్యేక కార్మిక కమిషనర్ (ఎఫ్‌ఏసీ) హరిచందన దాసరి ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మంచిర్యాల నోడల్ అధికారిగా పనిచేసిన సమయంలో కొన్ని క్లెయిమ్‌లకు సంబంధం లేని, అనుమానాస్పద పత్రాలు అప్‌లోడ్ చేయడం, పత్రాలను సక్రమంగా ధ్రువీకరించకపోవడం, భౌతిక ఫైళ్లు అందుబాటులో లేకపోవడం వంటి లోపాలు గుర్తించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌లో ఉంచాలని నిర్ణయించారు. సస్పెన్షన్ కాలంలో ఆయన కరీంనగర్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు.
వార్షిక ఆదాయం రూ.12
ఇల్లందకుంట: సాధారణంగా ఎంత పేదవారైనా రెవెన్యూ అధికారులు వార్షిక ఆదాయం రూ.50వేలకు పైగా సూచిస్తూ.. ధ్రువీకరణ సర్టిఫికెట్ జారీ చేస్తుంటారు. జిల్లాలోని ఇల్లందకుంట మండల రెవెన్యూ అధికారులు ఓ వ్యక్తి వార్షిక ఆదాయం కేవలం రూ.12 ఉన్నట్లు పేర్కొంటూ సర్టిఫికెట్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. మండలకేంద్రానికి చెందిన అరెల్లి షాలినీ ఆదాయం సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. ఈనెల 19న అధికారులు వారి కుటుంబానికి వార్షిక ఆదాయం రూ.12 వస్తుందని సర్టిఫికెట్ జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు, విద్యా ప్ర యోజనాలు, రాయితీలు తదితర అవసరాలకు ఆదాయం ద్రువీకరణ పత్రం కీలకం. అలాంటి సర్టిఫికెట్‌లో వార్షిక ఆదాయం రూ.12గా నమోదు చేయడంపై మండలవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా..? లేక వివరాల నమోదులో సాంకేతిక తప్పిదమా అన్నది తేలాల్సి ఉంది.


