కరీంనగర్ కార్పొరేషన్: సరైన కారణం లేకుండా ఒక్క ఓటు తొలగిపోదని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటీసులు జారీ అయిన ఓటర్లు ఖచ్చితమైన ధ్రువపత్రాలతో నిర్ణయించిన తేదీల ప్రకారం నగరపాలక సంస్థ కళాభారతి కౌంటర్లను సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. నిర్ణయించిన తేదీల్లో హాజరుకాకపోతే, సెప్టెంబర్ 22 తేదీ లోగా కళాభారతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో చూపించొచ్చన్నారు. ఓటర్లు హాజరయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. నోటీసులు అందుకున్నవారు నిర్ణీత ద్రువీకరణ పత్రాలు సమర్పించకుంటే ఓటు తొలగిపోయే అవకాశం ఉందన్నారు. నోటీసులు జారీ అయిన ఒక్క ఓటరును కారణం లేకుండా తొలగించడం జరగదని స్పష్టం చేశారు. ఓటరు మార్పు చేర్పులు, షిఫ్టింగ్ తదితర ప్రక్రియకు ఫారం 8 బీఎల్‌ఓలకు అందించవచ్చన్నారు.
రెండు రోజుల్లో సర్ నోటీసులు పూర్తి చేయాలి
ఎస్‌ఐఆర్ నోటీస్‌ల పంపిణీ రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బీఎల్‌వో సూపర్‌వైజర్లు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. సర్ నోటీసుల పంపిణీ, ధ్రువపత్రాల ఆన్‌లైన్ ప్రక్రియ, నోటీసుల పరిష్కారంపై ఓటర్లకు అవగాహన తదితర అంశాలపై చర్చించారు. ఎవరి పోలింగ్ బూత్ నంబర్ల ప్రకారం వారు కౌంటర్ల వద్ద షెడ్యూల్డ్ తేదీల్లో నోటీసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


