గస్తీ తగ్గిందా?
ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
ఒక నగరం అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి అద్దాల మేడలు, రంగుల రోడ్లు మాత్రమే కొలమానం కాదు.. అర్ధరాత్రి వేళ కూడా సామాన్యుడు నిర్భయంగా నడవగలగడమే నిజమైన ప్రగతి. కానీ.. కరీంనగర్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వీధి దీపాలు వెలగడం లేదు.. సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. పోలీసుల గస్తీ కనిపించడంలేదు. యంత్రాంగం మధ్య సమన్వయ లోపం, బాధ్యతారాహిత్యం సామాన్య ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవలే జరిగిన దొంగతనాలు ‘సిటీ’జనులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
కరీంనగర్‌క్రైం
కరీంనగర్ స్మార్ట్‌సిటీ పరిధిలోని అనేక ప్రధాన రహదారులు, కాలనీలు, అంతర్గత వీధుల్లో రాత్రివేళ వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా కలెక్టరేట్‌కే సరైన భద్రల లేకుండాపోయింది. రాత్రి ఎప్పుడైనా, ఎవరైనా వెళ్లొచ్చు రావచ్చు అన్నరీతిగా ఉండడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కలెక్టరేట్ రోడ్‌లో లైట్ల వెలుగుతో తెల్లారేవరకు మధ్యాహ్నం వలె ఉండేది. అక్కడ యువత రీల్స్ చేసుకోవడం, షార్ట్‌ఫిల్మ్‌లు తీయడం చాలాసార్లు కనిపించేది. ఇటీవల ఆ లైట్లు కొన్ని పనిచేయకపోవడంతో చీకటిగానే కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త కాలనీలు, శివారు ప్రాంతాలు, ఖాళీ స్థలాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. చీకటిని ఆసరాగా చేసుకుని దొంగలు సులభంగా సంచరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీసీ కెమెరాలు అమర్చడంలో ఉన్న శ్రద్ధ వాటిని పూర్తిస్థాయిలో పని చేయించడంలో లేదని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 10,550 సీసీ కెమెరాలు ఉండగా అందులో 3,500 వరకు పలు కారణాలతో పనిచేయడం లేదు. నగరంలో సుమారు 4,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, అదనంగా 750 సీసీ కెమెరాలు స్మార్ట్‌సిటీ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్‌ను మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే వీటిలో దాదాపు 30 శాతం వరకు సాంకేతిక లోపాలు, మరమ్మతుల కారణంగా పనిచేయడం లేదని సమాచారం. దీంతో నేరాలు జరిగినా నిందితుల కదలికలు గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. కరీంనగర్ బస్టాండ్‌లో 44 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అందులో ఇటీవల తనిఖీ చేసిన సమయంలో 22 మాత్రమే పనిచేస్తున్నాయి.
రాత్రి వేళల్లో పోలీసు అధికారుల గస్తీ, బీట్ కానిస్టేబుళ్లు, బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల సంచారం గతంతో పోలిస్తే తగ్గిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రతీ కాలనీలో కనిపించే పోలీసు వాహనాలు ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గస్తీ బలహీనపడడంతో నేరస్తుల్లో భయం తగ్గిందని అభిప్రాయపడుతున్నారు. నైట్ రూట్ ఆఫీసర్, నైట్ సూపర్‌వైజింగ్ ఆఫీసర్, నైట్ డ్యూటీ ఆఫీసర్‌ల టీంలతో పాటు వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఆయా పోలీసుల ప్రత్యేక పెట్రోలింగ్ కొనసాగుతుంది. ఇందులో పలువురు అధికారులు విధుల్లో ఉన్నప్పుడు కేవలం ప్రధాన రోడ్ల కూడళ్ల వద్దే సంచరిస్తున్నారని, కాలనీల్లోకి వెళ్లడం లేదని విమర్శలున్నాయి. ఇంకా కొందరు విధుల్లో ఉన్నప్పుడు తూతూ మంత్రంగా ఒకట్రెండు రౌండ్లు వేసి ఒకచోట ఆపి వాహనాల్లోనే నిద్రిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల నగరంలో పీఎంజే జువెల్లరీ ఘటన, భగత్‌నగర్ దోపిడీ, అదే రోజు మధ్యాహ్నం తులసీనగర్‌లో జరిగిన చోరీ పరిశీలిస్తే భద్రతపై పూర్తి నమ్మకాన్ని పోగొట్టేలా కనిపిస్తున్నాయి. ఒకేరోజు రెండు చోరీలు, అర్ధరాత్రి దోపిడీ ఘటనలు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దొంగలు ముందుగానే చీకటి ప్రాంతాలు, కెమెరాలు పనిచేయని ప్రాంతాలను గుర్తించి నేరాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


