అమ్మో.. బ్లాక్‌ స్పాట్స్‌! | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. బ్లాక్‌ స్పాట్స్‌!

Jul 25 2026 1:53 AM | Updated on Jul 25 2026 1:53 AM

ఎన్‌హెచ్‌–563పై గుర్తించిన బ్లాక్‌ స్పాట్లు

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో జాతీయ రహదారి–563పై ప్రమాదాల తీవ్రత ఆందోళనకరంగా మారింది. జిల్లాలో 51.5 కిలోమీటర్ల పొడవు ఉన్న రహదారిపై 2023 నుంచి 2025 వరకు జరిగిన ప్రమాదాల విశ్లేషణలో 10 ప్రమాదకర ‘బ్లాక్‌ స్పాట్లను‘ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మూడేళ్లలో 173 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 58 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్‌ స్పాట్‌ అంటే సుమారు 500 మీటర్ల పరిధిలో మూడేళ్లలో కనీసం ఐదు తీవ్ర ప్రమాదాలు లేదా పది మరణాలు సంభవించిన ప్రాంతాన్ని అంటారు. ఈ ప్రమాణాల ఆధారంగానే కమిషనరేట్‌లో ప్రమాద ప్రాంతాలను గుర్తించారు.

కొత్తపల్లి టర్నింగ్‌ అత్యంత ప్రమాదకరం

అత్యధిక ప్రమాదాలు కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి ప్రభుత్వ పాఠశాల సమీపంలో టర్నింగ్‌ వద్ద నమోదయ్యాయి. ఈ ఒక్క ప్రాంతంలోనే మూడేళ్లలో 31 ప్రమాదాలు జరుగగా, ఆరుగురు మృతిచెందారు. ప్రమాదాల పరంగా ఇది కమిషనరేట్‌లోనే అత్యంత ప్రమాదకర ప్రాంతంగా నిలిచింది.

మానకొండూర్‌, కేశవపట్నం

ప్రాంతాలు ఆందోళనకరం

మానకొండూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చెరువుకట్ట–పల్లె బస్టాండ్‌ సమీపంలో మూడేళ్లలో 20 ప్రమాదాలు జరుగగా, ఏడుగురు మృతిచెందారు. ఖాదర్‌గూడెం–చెంజర్ల మధ్య 16 ప్రమాదాలు, 3 మరణాలు చోటుచేసుకోగా, తాడికల్‌ బ్రిడ్జి సమీపంలో 14 ప్రమాదాలు, అత్యధికంగా 10 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కమిషనరేట్‌లో మరణాల పరంగా ఇదే అత్యంత ప్రమాదకర ప్రాంతంగా అధికారులు పేర్కొన్నారు. హుజూరాబాద్‌ పరిధి ఎరుకలగూడెం క్రాస్‌ రోడ్డు వద్ద 17 ప్రమాదాలు, 8 మరణాలు సంభవించాయి. అలాగే తుమ్మనపల్లి ఫిల్టర్‌ బెడ్‌, పర్కల్‌ క్రాస్‌ రోడ్‌ ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు తరచూ జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

చర్యలు అవసరమంటున్న ప్రజలు

ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌ స్పాట్ల వద్ద రోడ్డు ఇంజినీరింగ్‌ మార్పులు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ కంట్రోల్‌ చర్యలు, మెరుగైన లైటింగ్‌, సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌ పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు సీపీ గౌస్‌ ఆలం తెలిపారు.

ప్రమాదాలను నివారించాలి

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న చోట్ల అధికారులు బోర్డులు ఏర్పాటు చేసి, స్పీడ్‌ కంట్రోల్‌ వంటి చర్యలు చేపట్టాలి. పోలీస్‌, రవాణా అధికారులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించాలి.

– భాస్కర్‌, దమ్మక్కపేట, హుజురాబాద్‌

3

7

10

మరణాలు

8

2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement