విద్యార్థుల ఎదుట డిష్యుం..డిష్యుం హాస్టల్‌లోకి కల్లు తెచ్చుకున్న వాచ్‌వుమెన్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు బాధ్యత మరుస్తున్న గురువులు
‘చందుర్తి మండలం నర్సింగపూర్ ప్రైమరీ స్కూల్‌లో హెచ్‌ఎం జితేందర్‌రెడ్డి ట్రైనింగ్‌పై వెళ్లగా.. సీనియర్ టీచర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రీ ప్రైమరీ స్కూల్ ఆయాకు పాఠశాల సమయంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం పని చెప్పగా.. మీరెవ్వరూ నాకు పని చెప్పేదంటూ గొడవకు దిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నంత పని చేశారు. సీఆర్పీ, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు వెళ్లి ఆయాకు మరోసారి గొడవకు దిగొద్దని సర్ది చెప్పారు.’
‘చందుర్తి మండలం ఎన్గల్ జెడ్పీ హైస్కూల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉపాధ్యాయుడు అల్లరి చేస్తున్నారని ముగ్గురు విద్యార్థినులను కొట్టారు. ఇద్దరికి స్వల్పంగా గాయాలు కాగా వీరికి ఉపాధ్యాయులే వైద్యం చేయించారు. కాగా మరో విద్యార్థి అనారోగ్యం బా రిన పడి పాఠశాలకు రావడం లేదు.’
చందుర్తి(వేములవాడ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు గాడితప్పుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఫ్రస్ట్రేషన్.. సర్దిచెప్పే ఓపిక లేకపోవడం ప్రధాన సమస్యగా తెలుస్తోంది. సమాజంలో బాధ్యతాయుతమైన టీచర్ ఉద్యోగం చేస్తూ మరీ ఇంత దిగజారుడు ప్రవర్తన చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన గురువులే ఎడాపెడా కొడుతుంటే... ఎవరికీ చెప్పుకోవాలో అటు విద్యార్థులకు.. ఇటు తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు. ఈ వ్యవహారం ఇలాగే వదిలేస్తే ప్రభుత్వ విద్యావ్యవస్థ గాడితప్పే ప్రమాదం ఉందని విద్యాభిమానులు అ భిప్రాయపడుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దా ల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేకుంటే పాఠశాలల్లో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో కనిపించని ఉన్నతాధికారులు
మండలంలోని బండపల్లిలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వివాదం ఐదారు నెలలుగా కొనసాగుతున్న ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోవడంపై గ్రా మస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల గొడవ ఠాణా వరకు వెళ్లిందంటేనే మండల, జిల్లా స్థాయి విద్యాధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. సనుగుల విద్యార్థిపై దాడి, నర్సింగపూర్ ఇన్‌చార్జి హెచ్‌ఎంపై ఆయా దురుసు వ్యవహారం ఘటనలపై కనీసం విచారణ కూడా చేపట్టకపోవడం అధికారుల తీరును తెలియజేస్తుంది. జిల్లా అధికారులు ఉపాధ్యాయుల పనితీరుపై నిఘా పెట్టి పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలపై డీఈవో మొండయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.
‘చందుర్తి మండల కేంద్రంలోని బాలుర ఎస్సీ హాస్టల్ పనిచేస్తున్న వాచ్‌వుమెన్ కల్లు తీసుకొచ్చింది. గమనించిన ఓ విద్యార్థి ఆ కల్లులో ఉప్పు కలిపాడు. దీంతో కోపోద్రిక్తురాలైన వాచ్‌వుమెన్ విద్యార్థిపై చేయి చేసుకుంది. అంతటితో ఆగకుండా విద్యార్థి ప్రవర్తన సరిగ్గా లేదని వార్డెన్‌కు చెప్పడంతో టీసీ ఇచ్చారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఈ విషయాన్ని చందుర్తి సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ జోక్యం చేసుకున్నా వినకుండా ఆ విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించారు.’


