ఆషాఢమాసం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ అమ్మవారిని క్యారెట్ మాలలతో అలంకరించారు. అమ్మవారికి విశేష హారతులు ఇచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నమయ్య సేవా అధ్యక్షురాలు మమతారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు కోలాటం ప్రదర్శనతో శోభాయాత్రగా వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం చీర, సారే సమర్పించారు.
– విద్యానగర్(కరీంనగర్)
కరీంనగర్ అర్బన్: తహసీల్దార్ కార్యాలయాల్లో ఏళ్లుగా సేవలందిస్తున్న భూ భారతి ఆపరేటర్ల (ఎఫ్‌టీఎస్) భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వారిని దశలవారీగా తొలగించేందుకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగాలకే పరిమితమై, శాశ్వత ఉపాధిపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించిన తమను, ఎన్నికల విధులు మొదలుకొని ప్రభుత్వం అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించినా ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా విధుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్కువ రిజిస్ట్రేషన్ల సాకుతో..
జిల్లాలో 16 మండలాలకు ప్రస్తుతం 18 మంది ఎఫ్‌టీఎస్‌లు సేవలందిస్తున్నారు. అయితే చిన్న మండలాల్లో పనిచేస్తున్న ఎఫ్‌టీఎస్‌లను తొలగించి, కొన్ని పెద్ద మండలాల్లో మాత్రమే భూభారతి ఆపరేటర్లను కొనసాగించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం పరిపాలనా అవసరాల మేరకు చిన్న మండలాలకు బదిలీ చేసిన ఉ ద్యోగులను ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నాయనే కారణంతో తొలగించడం అన్యాయమ న్న వాదన వినిపిస్తోంది. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లు లేదా రికార్డు అసిస్టెంట్లతో విధులు నిర్వహించే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిని విధుల్లోకి తీసుకోకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్థానిక తహసీల్దార్లకు ఇబ్బందులు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దశాబ్దాలుగా సేవ చేస్తే ఇదేనా గౌరవం
చాలా ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ విధానంలో రెవెన్యూ శాఖకు సేవలందిస్తున్న వీరు కంప్యూటర్ ఆధారిత రికార్డుల నిర్వహణ, దరఖాస్తుల ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ సేవలు, ఎన్నికల విధులు ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. గతంలో వీరి సేవలు అవసరమని అధికారులే నివేదికలు పంపినా, ఇప్పుడు వారిని కొనసాగించవద్దన్న నిర్ణయం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దశాబ్దాలుగా సేవలందిస్తుంటే తమకిచ్చే గౌరవం ఇదేనా..నని ప్రశ్నిస్తున్నారు. చాలామంది వయసు పైబడిందని, ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడాలన్నా దరఖాస్తు చేయలేని పరిస్థితని వాపోతున్నారు.


