సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

● స్వచ్ఛ కరీంనగర్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి ● కలెక్టర్‌ చిత్రామిశ్రా

కొత్తపల్లి(కరీంనగర్‌): సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు. డివిజన్ల వారీగా ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి వార్డు సభల్లో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. డివిజన్లలో పరిశుభ్రత చాలా ముఖ్యమని, స్వచ్ఛ కరీంనగర్‌ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజల కార్యాచరణలో భాగంగా కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం రేకుర్తిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో 14,15,16,17,18,19,20, 21,22,23,24, 25,46, 47, 48 (చింతకుంట, కొత్తపల్లి, రేకుర్తి, సీతారాంపూర్‌, మల్కాపూర్‌, విద్యానగర్‌, పద్మనగర్‌, రాంనగర్‌ ప్రాంతాలు)డివిజన్లకు నిర్వహించిన ప్రత్యేక వార్డుల సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెత్తను 4 పద్ధతుల్లో వేరు చేసి కార్మికులకు అందించాలని, డివిజన్లలోని ఆరోగ్య కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. నగరంలో జరుగుతున్న పెన్షన్‌ మ్యాపింగ్‌లో ఆన్‌లైన్‌ ఫొటో ఐడెంటిఫికేషన్‌ కేవైసీ తప్పక చేయించుకోవాలన్నారు. డివిజన్లలో శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులపై ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు, నగరంలోని డంపుయార్డు ప్రక్షాళన కోసం అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ స్కీంలో రూ.80 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ నివాస గృహాల పథకంలో మొదటి విడతలో 1300 మంజూరుకాగా, రెండో విడత మంజూరయ్యే 2 వేల ఇండ్ల కోసం ముందస్తు ప్రణాళిక చేశామన్నారు. డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌ రావు మాట్లాడుతూ డివిజన్ల వారిగా ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. కార్పొరేటర్లు సుధగోని మాధవి, పర్వతం మల్లేశం గంట శ్రీనివాస్‌, వాసాల రమేశ్‌, వరాల నర్సింగం, ఒంటెల సత్యనారాయణరెడ్డి, కాంతాల జగన్‌ రెడ్డి, అదనపు కమిషనర్లు ఆయాజ్‌, సువార్త, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్‌ మొహియుద్దీన్‌, వేణు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement