కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరిగిన రాష్ట్ర వ్యాయామ విద్యా ప్రవేశ శారీరక దారుఢ్య (టీజీపీఈసెట్ 2026) పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షల హాజరుశాతం, సీట్ల లభ్యతను పరిశీలిస్తే వ్యాయామ ఉపాధ్యాయ కోర్సులకు క్రేజ్ పడిపోతోందని స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లే ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టుల భర్తీతో పాటు ప్రతి పాఠశాలలో పీఈటీ ఉండేలా చేయాలని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గైర్హాజరుల పరంపర
ఈ ఏడాది బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు 3,362 మంది దరఖాస్తు చేసుకోగా 2,435మంది (72.42 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. 927 మంది అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్షలకు రాకపోవడం గమనార్హం. బీపీఈడీ కోర్సుకు మొత్తం 2,386 మంది దరఖాస్తు చేయగా 1,788 మంది హాజరయ్యారు. 598 మంది గైర్హాజరయ్యారు. డీపీఈడీ కోర్సుకు 976 మంది దరఖాస్తు చేయగా 647 మంది హాజరయ్యారు. 329 మంది గైర్హాజరయ్యారు.
బీపీఈడీ సీటుకు 1.15 మంది, డీపీఈడీ సీటుకు 2.16 మంది పోటీ
ప్రతివంద మందిలో 87 మందికి బీపీఈడీ సీటు ఖాయం కావడం విశేషం. బీపీఈడీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు 1,788 మంది కాగా, సీట్లు 1,560 ఉన్నాయి. ప్రతి సీటుకు కేవలం 1.15 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. శారీరక దారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయితే చాలు సీటు ఖాయమనే పరిస్థితి కనిపిస్తోంది. డీపీఈడీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు 647 మంది కాగా, సీట్లు 300 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సీట్లు హాజరైన అభ్యర్థులలో 46.37 శాతం మందికి సరిపోతాయి. ప్రతి సీటుకు 2.16 మంది పోటీ పడుతున్నారు. వ్యాయామ విద్యపై క్రేజ్ తగ్గడానికి అభ్యర్థుల లోపం కాదు, రాష్ట్రంలో నెలకొన్న విద్యా, క్రీడా విధానాలే కారణమని నిపుణులు తేల్చి చెబుతున్నారు
స్కూళ్లలో పీఈటీ పోస్టుల కొరత
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ పో స్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల సుమారు 1,800 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినా యువతలో నమ్మ కం కలుగలేదు. తెలంగాణలో ఒకవైపు యూత్ అండ్ స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి చర్చలు జరుగుతున్నా పీఈటీ కోర్సులకు ప్రాధాన్యత లేకపోవడం విడ్డూరం.
కోర్సు అభ్యర్థులు హాజరైనవారు గైర్హాజరు
బీపీఈడీ 2,386 1,788 598
డీపీఈడీ 976 647 329
కోర్సు కళాశాలలు అందుబాటులో ఉన్న సీట్లు
బీపీఈడీ 15 1,560
డీపీఈడీ 03 300
బీపీఈడీలో హాజరైన 87 శాతం మందికి సీటు వచ్చే అవకాశం


