మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్‌ విలీనం | - | Sakshi
Sakshi News home page

మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్‌ విలీనం

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘాలను(డీసీఎంఎస్‌) మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కరీంనగర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, గంగాధర డీసీఎంస్‌లలో ఏడాది పొడవునా అన్నదాతకు మెరుగైన సేవలందనున్నాయి. ప్రస్తుతం డీసీఎంఎస్‌లు సీజనల్‌గా మాత్రమే సేవలందిస్తుండగా మిగిలిన రోజుల్లో ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి వెళ్తున్నారు. రాబడి లేక వేతనాలూ ఆలస్యంగా వస్తుండగా కార్యాలయాల నిర్వహణకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలోని అన్ని డీసీఎంఎస్‌లు నష్టాల్లోనే ఉండగా అరకొర ఆదాయమే. మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని నిర్ణయించడం శుభపరిణామమని వ్యవసాయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

విలువైన ఆస్తులు.. రూ.వంద కోట్లపైనే

జిల్లాలోని 4 డీసీఎంఎస్‌లకు కలిపి రూ.వంద కోట్లకు పైగా ఆస్తులున్నాయి. వ్యాపార వాణిజ్య కేంద్రంగా పేరున్న కరీంనగర్‌ డీసీఎంఎస్‌కు 5ఎకరాల స్థలం ఉంది. మార్కెట్‌ ఏరియాలో ఉండటంతో గోదాంలు, వ్యాపార దుకాణాల సముదాయం, పరిపాలన భవనం ఉంది. వాటి విలువ రూ.వంద కోట్లకు పైగా ఉంటుంది. ఒకప్పడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రైతులకు విశేష సేవలందించిన డీసీఎంఎస్‌ ప్రస్తుతం కునారిల్లే దశకు చేరింది. కేవలం సీజన్లో ధాన్యం సేకరణ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఎరువులు, విత్తనాల విక్రయాలు ఆగిపోయాయి. రూ. కోట్ల విలువైన దుకాణాలు, ఖాళీ స్థలాలున్నాయి.

కార్యకలపాలు విస్తృతం

మార్క్‌ఫెడ్‌ ప్రస్తుతం ఏడాది పొడవునా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇందుకోసం జిల్లాలోని డీసీఎంఎస్‌లను వినియోగించుకోనుంది. మార్క్‌ఫెడ్‌కు ఎరువుల బఫర్‌, పప్పుధాన్యాలు, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ఇక మార్క్‌ఫెడ్‌ నిర్వహించనుంది.

ఆస్తులు.. అప్పుల బదలాయింపు

రాష్ట్ర ప్రభుత్వం డీసీఎంఎస్‌లను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయడానికి ముందు ఆస్తులు, అప్పులను పరిగణనలోకి తీసుకుంటుంది. వాటిని మార్క్‌ఫెడ్‌కు బదిలీ చేస్తారు. ఆర్థిక, సహకారశాఖ, మార్క్‌ఫెడ్‌ల మధ్య విలీన ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం జీవో ఇవ్వనుంది. డీసీఎంఎస్‌ల్లో పనిచేసే ఉద్యోగులంతా మార్క్‌ఫెడ్‌కు బదిలీ అవుతారు. ఇప్పటి వరకు జిల్లా పరిధిలో మాత్రమే పనిచేసిన ఉద్యోగులు విలీన ప్రక్రియ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోదాంలు, కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదోన్నతులు, సీనియారిటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, మార్క్‌ ఫెడ్‌ ఉద్యోగులకు వర్తించే ఈపీఎఫ్‌, గ్రాట్యుటీ, పింఛన్లు వర్తిస్తాయి. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌లో విలీనం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, ఉద్యోగులు ప్రతి నెలా వేతనాలకు ఎదురు చూడాల్సిన పని ఉండదని డీసీఎంఎస్‌ అధికారులు చెబుతున్నారు. ఏడాది పాటు పని ఉండనుండగా విలీన ప్రక్రియతో రైతులకు మెరుగైన సేవలు అందుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement