కరీంనగర్: పొగాకు వాడకం కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదని, అది నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని కబళించే ప్రమాదకర విషమని వైద్యులు హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో కార్డియాలజిస్టు డాక్టర్ అనీష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేశ్ మాట్లాడారు. పొగాకు వినియోగం నేరుగా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బీడీ, సిగరెట్, గుట్కా వంటి అలవాట్లు రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తాయని వివరించారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి పొగ తాగితే.. దాని ప్రభావం కుటుంబ సభ్యులపై కూడా తీవ్రంగా పడుతుందని హెచ్చరించారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, అబ్దుల్ వకీల్, సూపరింటెండెంట్ డా క్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
● రూ.15లక్షల ఆస్తి నష్టం
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని తిరుమలనగర్‌లో ఉన్న తిరుమల థియేటర్‌లో శుక్రవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా థియేటర్ మొత్తం మంటలు వ్యాప్తి చెందడంతో సుమారు 200 సీట్లు, పాల్‌సీలింగ్, ఫ్లయ్‌వుడ్ స్క్రీన్, సౌండ్ సిస్టం, క్యాబిన్లు, ప్రొజెక్టర్ గది కాలిపోయాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఫైర్ అధికారులు థియేటర్ మేనేజింగ్ పార్ట్‌నర్ ఎం.మల్లేశం వద్ద వివరాలు తీసుకొని విచారణ జరుపుతున్నారు. సుమారు రూ.15లక్షల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. థియేటర్‌లో కరెంటు సరఫరా లేదు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫైర్ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


