బ్లాక్‌లో గ్యాస్‌..! | - | Sakshi
Sakshi News home page

బ్లాక్‌లో గ్యాస్‌..!

Mar 16 2026 7:52 AM | Updated on Mar 16 2026 7:52 AM

● హోటళ్లలో విరివిగా వినియోగం ● రీఫిల్లింగ్‌కు తెరలేపిన అక్రమార్కులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణాన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. వంటింట్లో ఉండాల్సిన డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ వాణిజ్య సముదాయాల్లో దర్శనమిస్తోంది. పౌరసరఫరాలశాఖ, విజిలెన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీ చేస్తున్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా పక్కదారి పట్టిస్తున్నారు. కరీంనగర్‌తో పాటు జమ్మికుంట, హుజూరాబాడ్‌, గంగాధర, చొప్పదండి, కొత్తపల్లి తదితర ప్రాంతాలోని హోటళ్లలో తెరచాటుగా వినియోగిస్తుండగా నామమాత్రపు చర్యలేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తుండగా, హోటళ్లలో భారీ ఎత్తున గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దాడులు నిరంతరంగా కొనసాగితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశముంది.

జోరుగా రీ ఫిల్లింగ్‌ దందా

జిల్లాలో 4.39లక్షల గ్యాస్‌ వినియోగదారులండగా 80వేల కమర్షియల్‌ కనెక్షన్లున్నాయి. కమర్షియల్‌ బుకింగ్‌ నామమాత్రంగా సాగుతుండగా వంట గ్యాస్‌ సిలిండర్లపై దృష్టిసారించారు. పలు ఏజెన్సీల ద్వారా గ్యాస్‌ బుక్‌ చేస్తూ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని తెలుస్తోంది. డొమెస్టిక్‌ గ్యాస్‌కు రూ.985 కాగా కమర్షియల్‌ గ్యాస్‌కు రూ.2వేలకు పై మాటే. ఈ క్రమంలో సగం తేడా ఉండటం, కమర్షియల్‌ సిలిండర్లు దొరకకపోవడంతో హోటళ్లు, బార్లు, ప్రైవేట్‌ హాస్టళ్లలో డొమెస్టిక్‌ సిలిండర్లనే వినియోగిస్తున్నారు. సదరు సిలిండర్‌ను రూ.1200 నుంచి రూ.1500కు విక్రయిస్తుండగా బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఇక పలువురు గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, ఏజెన్సీలు వంటగ్యాస్‌ను కమర్షియల్‌ సిలిండర్లలో నింపుతూ హోటళ్లు, బార్లు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. నగరంలో సగానికి పైగా ఇవే దర్శనమిస్తున్నాయి.

యుద్ధ తీవ్రతతో పెరిగిన బుకింగ్‌లు

మామూలుగా రోజుకు సుమారు 7500 వరకు బుకింగ్‌లు చేసుకొనేవారు. ప్రస్తుత పరిస్థితులతో బుకింగ్‌ల సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పటికీ 25వేలకు పైగా బుకింగ్‌ అయ్యాయి. మూడు రెట్లు అధికంగా నమోదు చేయగా వీటిని సరఫరా చేయాలంటే కనీసం ఐదు రోజుల సమయం పడుతుంది. ఓ వైపు సప్లయ్‌ చేస్తుండగానే మరోవైపు బుకింగ్‌ల సంఖ్య పెరుగుతోంది. దీంతో పెండింగ్‌ సంఖ్య పెరిగిపోతోంది. గ్యాస్‌ సరఫరా లేదనే సాకుతో కొన్ని టిఫిన్‌ సెంటర్లలో సాంబార్‌ ఇవ్వడం లేదు. టిఫిన్‌ ధరలు రూ.5 నుంచి రూ.10 పెంచేశారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడితో చమురు సంస్థలు దిద్దుబాటు చర్యలకు దిగాయి. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్‌ చిత్రా మిశ్రా తీవ్రంగా హెచ్చరించడంతో పాటు కమిటీని ఏర్పాటు చేశారు.

జిల్లా జనాభా: 10,09,432

గ్యాస్‌ కనెక్షన్లు: 4,39,856

కమర్షియల్‌ కనెక్షన్లు: 80,000

గతంలో రోజువారి బుకింగ్‌: 7,500

ప్రస్తుతం: సుమారు 23,000

వాణిజ్య సముదాయాల్లో డొమెస్టిక్‌ సిలిండర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement