‘పాత’పనులు.. నిధులొస్తేనే కదులు | - | Sakshi
Sakshi News home page

‘పాత’పనులు.. నిధులొస్తేనే కదులు

Mar 16 2026 7:52 AM | Updated on Mar 16 2026 7:52 AM

● నగరంలో రోడ్లు తవ్వి రెండేళ్లు ● నిత్యం ప్రజలకు ఇక్కట్లు ● పెండింగ్‌ పనులపై రాని స్పష్టత ● ప్రత్యేక నిధులొస్తేనే పూర్తయ్యే చాన్స్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: 28 నెలలు.. నగరంలోని 65 ప్రాంతాల్లో సగం పనులతో ప్రజలు నరకం చూ స్తున్న కాలం. ఇళ్ల పక్కన మోరీలు, ఇళ్ల ఎదుట రోడ్లు కొత్తగా వస్తున్నాయనే సంబరం నిత్య నరకంగా మారుతుందని ఆ ప్రాంత వాసులు అప్పట్లో అనుకోలేదు. కొత్త రోడ్లు వేస్తున్నామని, మోరీలు కడుతున్నామని, ఉన్న రోడ్లు తవ్వినా, ఇళ్ల ఎదుట నడవడానికి కష్టంగా మారినా.. ‘కొద్దిరోజులే’ కదా అని ఓర్చుకున్నారు. ఆ కొద్ది రోజులు 28 నెలలు దాటినా రాకపోవడం, అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడంతో వ్యవస్థను, అధికారులను తిట్టుకుంటూ ఏళ్లుగా కాలం వెళ్లదీస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) కింద చేపట్టిన అసంపూర్తి పనుల బాధిత ప్రజల వ్యథ ఇది.

రూ.132 కోట్లు...121 పనులు

స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.వందల కోట్లతో నగరంలో పనులు చేపట్టారు. ప్రధాన రహదారులు, ముఖ్యకూడళ్లు ఆధునీకరించారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి అంతా ప్రధాన రహదారులకే పరిమితం కావడం, అంతర్గత రోడ్లు, లింక్‌ రోడ్లు అధ్వాన స్థితిలో ఉండడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. దీంతో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) కింద ప్రత్యేకంగా నిధులు కేటా యించింది. సుమారు రూ.131 కోట్లతో 121 పనులు చేపట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నగరంలోని 65 చోట్ల సీఎంఏ నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో కొన్ని చోట్ల నిర్మాణాలు కొంతమేర కాగా, మరికొన్ని చోట్ల పాత రోడ్లు తవ్వారు. ఈ సమయంలోనే 2023 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడం, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టడం జరిగిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే, సీఎంఏ కాంట్రాక్టర్‌ ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు.

అప్పటి నుంచి ఇక్కట్లే...

అప్పటి నుంచి ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్గత రోడ్లు, లింక్‌రోడ్లు తవ్వి వదిలేయడం, సగం పనులతో రెండేళ్లుగా నరకం చూస్తున్నారు. కోతిరాంపూర్‌ నుంచి కట్టరాంపూర్‌, జ్యోతినగర్‌ మోర్‌ సూపర్‌ మార్కెట్‌ నుంచి మంకమ్మతోట మీదుగా కశ్మీర్‌గడ్డ్డ లింక్‌రోడ్లతో పాటు దాదాపు ప్రతి డివిజన్‌లో ఏదో ఒక చోట రోడ్ల కోసం ఉన్నవి తవ్వడం, డ్రైనేజీల నిర్మాణానికి ఇండ్ల ఎదుట కందకాలు తవ్వి వదిలేయడంతో ప్రజలు ప్రమాదాలతో సావాసం చేయాల్సి వస్తోంది. అధికారులూ పట్టించుకోకపోవడంతో చివరకు ఇళ్ల ఎదుట సొంతంగా తాత్కాలిక నిర్మాణాలు చేసుకున్నారు.

పెండింగ్‌ పనులపై పట్టింపేది?

రాజకీయ లబ్ధికోసమే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా పనులు చేపట్టిందని, నిధులు లభ్యత ఆధారంగా పనులు పూర్తి చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రూ.30 కోట్లు సంబంధిత కాంట్రాక్టర్‌కు చెల్లించామని, కొన్ని పనులు పూర్తి చేస్తున్నారంటున్నారు. ఎవరి హయాంలో మొదలు పెట్టినా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంటుందని బీఆర్‌ఎస్‌ అంటోంది. ప్రజలకు వసతులు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బీజేపీ చెబుతోంది. ప్రత్యేకంగా నిధులు వస్తే తప్ప అసంపూర్తి పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న పనులు రెండేళ్లు దాటినా అతీగతీ లేకపోవడంపై బాధిత ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement