నివేదిక సమర్పణకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

నివేదిక సమర్పణకు వేళాయె

Mar 16 2026 7:39 AM | Updated on Mar 16 2026 7:39 AM

రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ల కోసం ప్రతిపాదిత విమానాశ్రయం ఏర్పాటు అంశం ఏవియేషన్‌ అధికారులు కేంద్ర పౌరవిమానాయాన శాఖకు అందించే నివేదికపై ఆధారపడి ఉంది. గత డిసెంబర్‌లో ఏఏఐ, ఇరిగేషన్‌, గ్రౌండ్‌వాటర్‌, రెవెన్యూ, హైడ్రాలజిస్ట్‌, సింగరేణి, ఎన్టీపీసీ, ఎన్పీడీసీఎల్‌, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, మైనింగ్‌ తదితర శాఖల ఉన్నతాధికారులు సంయుక్తంగా ప్రతిపాదిత విమానాశ్రయం స్థల పరిశీలన చేపట్టారు. క్షేత్ర పరిశీలన చేసి ప్రీ–ఫీజిబిలిటీ నివేదిక తయారీకి రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో రూ.40.53 లక్షలు ఏఏఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల బృందం విమానాశ్రయం ఏర్పాటుకు క్షేత్ర పరిశీలన చేసే క్రమంలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు తాము అందించే సేవలను, సాధ్యసాధ్యాలను వివరించారు. విభాగాల వారీగా చేపట్టిన సర్వే నివేదికలు గరిష్టంగా నాలుగు మాసాల్లోగా కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖకు సమర్పించాల్సి ఉండగా ఇప్పటికే సర్వే చేపట్టి వంద రోజులు పూర్తయింది.

రాజ్యసభలో అంతర్గాం ఎయిర్‌పోర్ట్‌పై చర్చ

గత డిసెంబర్‌ 8న రాజ్యసభలో పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు అంశమై చర్చకు రాగా ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్టు ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో చర్చించగా, తాజాగా ఫిబ్రవరిలో సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్రమంత్రి భేటీ కాగా అంతర్గాం సైట్‌ త్వరగా క్లియరెన్స్‌ ఇవ్వాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సీఎంకు సమాధానమిస్తూ ఏఏఐ ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్టు కోసం చూస్తున్నామని, క్షేత్ర పరిశీలన పూర్తయిన నాలుగు మాసాల్లోగా నివేదిక తమ శాఖకు సమర్పించనున్నారని, తదనుగుణంగా ముందడుగు వేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఫిబ్రవరిలో ఇద్దరు కేంద్రమంత్రుల చర్చ

గత ఫిబ్రవరిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సివిల్‌ ఏవియేషన్‌ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో జరిపిన సమీక్షలో అంతర్గాం ఎయిర్‌పోర్టు అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఏఏఐ టీం అంతర్గాంలో చేపట్టిన క్షేత్ర పరిశీలనలో 591–980 ఎకరాల భూమి లభ్యత ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిపినట్లు, అదే సమయంలో బసంత్‌నగర్‌లో కొండలు, హెచ్‌టీ లైన్లు అడ్డంకులతో తిరస్కరించినట్లు తెలిసింది. ఏదేమైనా మరో వారం రోజుల్లో ప్రీ–ఫీజిబిలిటీ నివేదిక సదరు మంత్రిత్వశాఖకు అప్పగించిన తర్వాత ఎయిర్‌పోర్టు స్థాపన విషయమై వేగంగా అడుగులు పడనున్నట్లు సమాచారం.

రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చిన ఎయిర్‌పోర్ట్‌

విమానాశ్రయం ఏర్పాటుకు ఏఏఐ సుముఖత

అంతర్గాంపై ఇద్దరు కేంద్రమంత్రుల చర్చ

క్షేత్రపరిశీలన చేసి వంద రోజులు

ప్రీ–ఫీజిబిలిటీ నివేదికతోనే ముందడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement