● ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 12మంది అరెస్ట్
● వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: సైబర్ నేరాలను అరికట్టేందుకు కరీంనగర్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో ఓ ముఠా గుట్టు రట్టు చేశారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సృష్టించి, నేరస్తులకు అందిస్తున్న ప్రధాన సూత్రధారితో సహా 12మందిని ఆదివారం అరెస్టు చేశారు. కమిషనరేట్ కేంద్రంలో సీపీ గౌస్‌ఆలం వివరాలు వెల్లడించారు. నగరంలోని భగత్‌నగర్‌కు చెందిన ముదిగంటి రాజేశ్వర్‌రెడ్డి (22), కిసాన్‌నగర్‌కు చెందిన నందగిరి సాయివర్దన్(22), దోబీవాడకు చెందిన కాళిదాసు కౌశిక్(23), కట్టరాంపూర్‌కు చెందిన మూలంకుల రాజ్‌కుమార్(23), శంకరపట్నం మండలానికి చెందిన బండి సాయికృష్ణ (26), విద్యానగర్‌కు చెందిన అడవెల్లి సాయికార్తీక్ (23), సవరన్ స్ట్రీట్‌కు చెందిన మీర్ జామీ ఉద్దీన్(22), సవరన్ స్ట్రీట్‌కు చెందిన మహమ్మద్ జవాద్‌ఖాన్(23), కోతిరాంపూర్‌కు చెందిన సర్దార్ దల్జీత్ సింగ్ (23), రామడుగుకు చెందిన పల్లెర్ల అజయ్ (24), మారుతినగర్‌కు చెందిన నిర్మల్ల శివ (23), దిద్ది సాయిచరణ్ (22) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అమాయక వ్యక్తుల పేరుతో వివిధ బ్యాంకుల్లో సేవింగ్, కరెంటు అకౌంట్లు తీసేవారు. ఆయా ఖాతాల పాస్‌బుక్‌లు, ఏటీఎంకార్డులు, సిమ్‌కార్డులును సైబర్‌నేరగాళ్లకు విక్రయించేవారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ మోసాలకు గురైన బాధితుల డబ్బులను చేతులు మార్చేవారు. ఇటీవల కరీంనగర్‌లో ఓ కేసు విషయంలో దర్యాప్తుల చేయగా ఈ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను అరెస్టు చేసి కీలకమైన పత్రాలు, బ్యాంకు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పట్టుకున్న కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టూ టౌన్ సీఐ సృజన్‌రెడ్డి, ఎస్సైలు శ్రీనాథ్, పోచయ్య, సైబర్‌క్రైం ఎస్సై అనిల్, సైబర్ క్రైంని సీపీ అభినందించారు.


