కరీంనగర్ డెయిరీకి అగ్రపీఠం
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ మిల్క్ డెయిరీ విస్తృత ప్రజాదరణ పొందుతోందని, దాని ఫలితమే అవార్డులని కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం స్థానిక డెయిరీలో మాట్లాడుతూ.. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరుణంలో 12వేల లీటర్ల పాల సేకరణ జరిగేదని, ప్రస్తుతం 2లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నామని వివరించారు. పాల విక్రయాలు గతంలో 4వేల లీటర్లు కాగా తాజాగా 1.80లక్షల లీటర్లు విక్రయిస్తున్నామని, రూ.7కోట్ల టర్నోవర్ నుంచి రూ.450కోట్లకు పెంచామని వెల్లడించారు. డెయిరీ నుంచి ఆరోగ్య శిబిరాలతో పాటు పశుదాణా, చాప్ కటర్లు, వెటర్నరీ అంబులెన్స్ సౌకర్యం కల్పించి రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచామని, ఇండియన్ డెయిరీ అసోసియేషన్ సౌత్‌జోన్ అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డుతో సత్కరించిందని వివరించారు. అలాగే ఐడీఏ తెలంగాణ చాప్టర్ పరిధిలో బెస్ట్ ఫుమెన్ డెయిరీ ఫార్మర్ అవార్డు డెయిరీ పాల ఉత్పత్తిదారురాలు అంకతి రాధకు దక్కిందన్నారు. పాల సేకరణలో సుందరగిరి, గంభీరావుపేట, నవాబుపేట కేంద్రాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయని, రంగోళి పోటీల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారని వివరించారు. పాలకవర్గ సభ్యులు ఎండీ డా.పి.శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.


