కల నెరవేరిన వేళ
కరీంనగర్: ఇన్నాళ్లు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతూ... ఎప్పుడు వస్తాయో తెలియని అరకొర వేతనాలతో పనిచేసిన ల్యాబ్ టెక్నీషియన్ల కల నెరవేరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులకు మెడికల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నియామక ప్రక్రియను గత ఏడాది నవంబర్ 17న పూర్తిచేసింది. మంగళవారం హైదరబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌ల చేతుల మీదుగా జాయినింగ్ రిపోర్టులు అందజేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లు 40 మంది జాయినింగ్ రిపోర్టులు అందుకున్నారు. ఇందులో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 4 గురు, జీజీహెచ్‌కు 18 మంది, వైద్యవిధాన పరిషత్‌కు 9 మంది, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలోని పీహెచ్‌సీలకు 9 మందిని నియామకం చేశారు. వీరంతా నేడో రేపో జాయిన్‌కానున్నారు. ఇ న్నాళ్లు కాంట్రాక్టు పద్ధతిన, ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేసినవారు, ప్రభుత్వ ఉద్యోగులుగా జాయినింగ్ రిపోర్టులు అందుకుని ఆనందం వ్యక్తం చేశారు.


