పునర్విభజన శాసీ్త్రయంగా జరగాలి
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విషయంలో కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహారించారని కుటుంబ ఆస్తులను పంచినట్లు కొడుకు, కూతురు, అల్లుడి కోసం జిల్లాలను ఏర్పాటు చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదే తీరు వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవన్నారు. జిల్లాల పునర్విభజన శాసీ్త్రయంగా జరిగపేందుకు తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చే సి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వీబీ–జీ రామ్ జీ’’పథకం బాగుందని కొనియాడారు. గ్రామానికి స్థిర ఆస్తులను సృష్టించడంతోపాటు ప్రతీ ఒక్కరికి కచ్చితంగా 125 రోజుల పని దొరుకుతుందన్నారు. వ్యవసాయ సీజన్‌లో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం ద్వారా ఉపశమనం కలగనుందన్నారు. గతంతో పోలిస్తే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.17 వేల కోట్లు కేటాయిస్తారని తెలిపారు. ఫలితంగా తెలంగాణకు రూ.340 కోట్లు అదనంగా వస్తాయన్నారు. ఇంత గొప్ప పథకాన్ని అడ్డుకోవాలని చూడటం కాంగ్రెస్ నీచ రాజకీయమని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తీసేయడంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తుందన్నారు. పాలకులు మారినప్పుడు పథకాల పేర్లు మారడం సహజమేనని, పథకాల మార్పుపై కాంగ్రెస్ చేస్తే సంసారం... మేం చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. గతంలో ఉపాధి పథకం కింద ఏటా రూ.86 వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసినా గ్రామానికి ఆస్తులు మాత్రం పెద్దగా పెరగలేదన్నారు. తవ్విన గుంతలే తవ్వడం వంటి పనులే చేశారని తెలిపారు. ‘వీబీ–జీ రామ్ జీ’’ కూలీలకే కాదు, రైతుల నెత్తిన పాలుపోసే పథకమని, వ్యవసాయ సీజన్‌లో ఈ చట్టం కింద పనులు చేపట్టకుండా నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చామని వెల్లడించారు. సీజన్ లో కచ్చితంగా ఏటా 60 నుంచి 80 రోజుల పని దొరుకుతుందని.. ఇవిగాక జీ రామ్ జీ పథకం ద్వారా 125 రోజుల పని ఉంటుందని.. మొత్తంగా ఏటా సగటున 200 రోజులు పని పక్కాగా దొరికే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్ కు అక్కసు ఎందుకని ప్రశ్నించారు. శ్రీరాముడి పేరును బతికినంత కాలం పెట్టుకుంటామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ స్టాండ్ క్లీయర్‌గా ఉందని, మతపరమైన రిజర్వేషన్లను తొలగించాల్సిందేనన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్‌రావు,డి.శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, రమేశ్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.


