నిబంధనల మేరకే భూ రిజిస్ట్రేషన్లు
కరీంనగర్ అర్బన్/కరీంనగర్/కొత్తపల్లి: భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కలెక్టర్ పమేలా సత్పతి సబ్ రిజిష్ట్రార్లు, తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, సుడా అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. భూముల రిజిస్ట్రేషన్లు, నిషేధిత జాబితా, లేఅవుట్ తదితర అంశాలపై సమీక్షించారు. అన్నిశాఖల వద్ద నవీకరించిన భూముల నిషేధిత జాబితా ఒకే రకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సదరు జాబితా సబ్ రిజిస్టర్, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్ స్థాయిలో తప్పక అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అక్రమ ఇంటినంబర్లు ఇప్పటికే రద్దు చేశామని, ఆ జాబితా అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసర్లకు పంపిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు కె.మహేశ్వర్, రమేశ్‌బాబు, డీపీవో జగదీశ్వర్ పాల్గొన్నారు.
‘ఆరోగ్య మహిళ’ పరీక్షలు తప్పనిసరి
మహిళలకు ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రేకుర్తిలోని పల్లె దవాఖానాను మంగళవారం సందర్శించారు. ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలను పరిశీలించారు. పలువురు మహిళలకు బీపీ పరీక్ష చేయించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళ ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలు చేయించుకునేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఆరు నెలల తర్వాత రెండవ దఫా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రక్తహీనత ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఐరన్, కాల్షియం మాత్రలు అందజేయాలన్నారు.


