
మెట్‌పల్లిలో దొంగల కలకలం
మెట్‌పల్లి: పట్టణంలోని 12వార్డు శివారులో ఉన్న సిద్ధివినాయకనగర్‌లో దొంగల సంచారం కలకలం రేపుతోంది. ముఖాలు కనిపించకుండా ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాలనీలో సంచరించారు. వీధుల్లో కలియ తిరుగుతూ పలు ఇళ్ల వద్ద రెక్కి నిర్వహించారు. తర్వాత తిరుమల అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ మూడో ఫ్లోర్ వరకు వెళ్లి వెనుదిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉండడం.. చోరీకి అనుకూలంగా లేకపోవడంతోనే వారు వెనుదిరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గురువారం ఉదయం దొంగలసంచారం వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇదే కాలనీలో కొన్ని నెలల క్రితం పట్టపగలే చోరీ జరిగింది. ఓ మహిళ ఇంటి ముందు ఉండగా.. ఓ యువకుడు వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. తాజాగా రాత్రి సమయంలో ముగ్గురు దొంగలు సంచరించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రతిరోజు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించే పోలీ సులు.. ఈ కాలనీ వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ అధికారులు స్పందించి శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.