
అప్పు చేసి పరారైన ఇద్దరి అరెస్టు
కోరుట్ల: రెండేళ్ల క్రితం టెక్స్‌టైల్స్ షాపులో భాగస్వామ్యం ఇస్తామని సుమారు 50 మంది వద్ద రూ.1.10 కోట్లు అప్పు తీసుకొని పరారైన రహమతి బేగం, మహ్మద్ గౌసుద్దీన్ వాజిద్‌లను అరెస్టు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. కోరుట్లలోని కాల్వగడ్డ ప్రాంతానికి చెందిన వీరిద్దరిపై 2023లో కేసు నమోదు కాగా, అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉంటూ ఎవరికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను తన కుమారుడు లండన్ వెళ్లడానికి కొంత, మరికొంత తమ అవసరాలకు వాడుకున్నారని ఎస్సై తెలిపారు.
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలని కొత్త బస్టాండ్ ఏరియాలో సోమవారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశారు. మధ్యాహ్నం వేళ అటుగా వెళ్తున్న వారిపై దాడిచేయడంతో పది మంది గాయపడ్డారు. గాయపడ్డవారు వెంటనే పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నారు. కాగా, మటన్, చికెన్ సెంటర్ల వద్ద వ్యర్థాలు పడవేస్తుండడంతో అక్కడకు గుంపులుగా చేరుతున్న శునకాలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. అటుగా వెళ్లేవారితోపాటు స్థానికులపైనా దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.
వక్ఫ్ ఆస్తులు రక్షించాలి
కరీంనగర్‌కార్పొరేషన్/విద్యానగర్: మున్సిపల్, కార్పొరేషన్‌ల పరిధిలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త అనుమండ్ల సురేశ్ కోరారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మమతుల్లా హుస్సేన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాల్టీల్లో అనేక విలువైన వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయని తెలిపారు. వక్ఫ్ బోర్డు భూములను రక్షించడానికి గతంలో జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారని చెప్పారు. అలాగే వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆయా మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయాలన్నారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే కొత్తపల్లి హావేలిలోని ఖాజీపూర్ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 55ఎకరాల భూమిని, కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకోవాలని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సోమవారం వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు.