
స్థానిక సంస్థల్లో మెజారిటీ సీట్లే లక్ష్యం
కరీంనగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ నభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తీసుకోవాల్సిన విధానాలు, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, జాతీయ, రాష్ట్ర మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలు, పెండింగ్ ప్రాజెక్టులపై పార్టీ వైఖరి తదితర అంశాలపై వివరించారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలమున్న చోట అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. డిసెంబర్ 26న పార్టీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు విజయవాడలో జరుగుతాయని తెలిపారు. ఖమ్మం జిల్లాకేంద్రంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ మహానభలు సెప్టెంబర్ 21 నుంచి 25వరకు చండీగడ్‌లో జరుగుతాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని కోరుతూ వచ్చేనెల 1న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ వరదకాలువను వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని, కానీ పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు లేకపోవడంతో ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్, టేకుమల్ల సమ్మయ్య, లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బండ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి