
బహ్రెయిన్ జైలులో ఐదుగురు తెలంగాణ వాసులు
జగిత్యాలక్రైం/ముస్తాబాద్(సిరిసిల్ల): బహ్రెయిన్ దేశంలో గడువుతీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసిన కేసులో తెలంగాణకు చెందిన ఐదుగురు కటకటాలపాలయ్యారు. అక్కడి కోర్టు ముగ్గురికి మూడేళ్లు, 19 మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు బహ్రెయిన్‌లోని తెలంగాణ సామాజిక సేవకుడు కోటగిరి నవీన్ తెలిపారు. ఈ కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన బంటు బాబుకు రెండేళ్ల శిక్ష పడింది. అతడి మేనమామ గాదం ప్రభాకర్ సాయం కోసం ఆదివారం తెలంగాణ ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా వివాహం కాని బాబు ఏడేళ్లుగా బహ్రెయిన్‌లో ఉంటున్నాడు. తల్లిదండ్రులు లేరు. పెళ్లైన ఒక్క చెల్లె ఉంది. మే 15 నుంచి తనను ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి చేయాలని ఆల్ దాయిస్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ యాజమాన్యానికి మార్చి 2న దరఖాస్తు చేసుకున్నాడు. ఇండియాకు రావాల్సిన అతను అనుకోకుండా జైలు పాలయ్యాడు. అలాగే, ఇద్దరు యజమానులకు లక్ష దినార్ల చొప్పున (రూ 2.3 కోట్లు) జరిమానా విధించారు.
చెప్పిన డ్యూటీ చేసినందుకు..
గోదాంలో ఆహార ఉత్పత్తులపై లేబుళ్లు తొలగించి, కొత్త తేదీలతో స్టిక్కర్లు అతికించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులను ఉపయోగించి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేసింది. యజమాన్యం చెప్పినట్లు డ్యూటీ చేయడం 19 మంది ప్రవాసీ కార్మికుల పాలిట శాపమైందని తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ ద్వారా జైల్లో ఉన్న కార్మికులకు న్యాయ సహాయం అందించాలని కోరారు.
ఆహార ఉత్పత్తుల తేదీల ఫోర్జరీ కేసులో శిక్ష