
అంతుచిక్కని వ్యాధి.. అవస్థల్లో విద్యార్థిని
● పంద్రాగస్టు వేడుకల్లో కుప్పకూలిన కీర్తన ● ఆపన్నహస్తం కోసం వేడుకోలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన విద్యార్థిని.. పండుగ పూర్తయ్యాక కాలేజీకి వెళ్లింది. పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని హఠాత్తుగా కుప్పకూలింది. అప్పట్నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరెపల్లె గ్రామానికి చెందిన కాంటాల లావణ్య– వీరన్న దంపతుల కూతురు కీర్తన. కరీంనగర్‌లోని ఓ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువులో ముందుండే బాలిక 15 ఆగస్టు వేడుకల్లో జెండా వందనం చేస్తూ కుప్పకూలింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కాలేజీకి పరుగెత్తి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అంతుచిక్కని వ్యాధిగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.10 లక్షల వరకు బిల్లు అయ్యింది. అయినా, ఇంకా నయం కాలేదు. స్థోమతకు మించి అప్పు చేసి వైద్యం చేయించామని, తమ కూతురును ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురును బతికించుకునేందుకు దాతలు సాయం చేయాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. ఆదుకునేవారు ఫోన్ నంబరు 99634 56258లో సంప్రదించవచ్చు.

అంతుచిక్కని వ్యాధి.. అవస్థల్లో విద్యార్థిని