
మంజూరు పోస్టులకు మహర్దశ
గతంలో ఏర్పడిన మండలాల్లో ఈ పోస్టులన్నీ రెగ్యులర్
కరీంనగర్ అర్బన్: నామమాత్రంగా ఉన్న కొత్త తహసీల్దార్ కార్యాలయాలకు జవసత్వాలనిస్తూ సీసీఎల్‌ఎ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల విభజన క్రమంలో 2016లో కొత్త మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సదరు తహసీల్దార్ కార్యాలయాలకు క్యాడర్ స్ట్రెంత్ పేరిట కొత్త పోస్టులను మంజూరు చేస్తూ భూ పరిపాలన విభాగం తాజాగా చర్యలు చేపట్టింది. తహసీల్దార్ మొదలుకొని ఆఫీసు సబార్డినేట్ వరకు మొత్తం 51పోస్టులను కేటాయించింది. ఇందులో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లందకుంట మండలాలకు పోస్టులను రెగ్యులర్ చేసింది. కొత్త మండలాలు ఏర్పడినట్టే కానీ ఇన్నాళ్లు డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించేవారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి తహసీల్దార్ వరకు ఇదే పరిస్థితి. వేతనాలు ఒక చోట విధులు మరో చోటగా వ్యవహరించారు. పది రెవెన్యూ గ్రామాలున్న మండలానికి ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లను కేటాయించగా.. ఆపై గ్రామాలున్న మండలానికి ముగ్గురిని నియమించింది. జిల్లా విభజన సమయంలో 12 మండలాలుండగా 2016 ఆక్టోబర్ 11న నాలుగు కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. అప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం ఇతర మండలాల నుంచి ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిన సర్దుబాటు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టులను మంజూరు చేయడంపై రెవెన్యూ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తహసీల్దార్: 04, నాయబ్ తహసీల్దార్: 04
గిర్దావర్లు: 08, సీనియర్ అసిస్టెంట్లు: 04
జూనియర్ అసిస్టెంటు: 04, టైపిస్టు: 04
సర్వేయర్లు: 04, ఏఎస్: 04
ఆఫీసు సబార్డినేట్/వాచ్‌మెన్: 11, చైన్‌మెన్: 04