
గుంతల రోడ్డుతో చింత
కరీంనగర్‌కార్పొరేషన్: నగరంలోని పలు కాలనీల్లో రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివారు కాలనీలు, మట్టి రోడ్లు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లపై గుంతలు మరింతగా ఇబ్బందిగా మారుతున్నాయి. నగరంలోని భగత్‌నగర్ శివాలయం ప్రాంతంలో రోడ్డుపై గుంతలు ప్రమాదకరంగా మారాయి. కాలనీలోని అంతర్గత ప్రధాన రోడ్డుపై ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. కాలనీవాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.రాత్రివేళల్లో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడంతో, ఇటీవల స్థానికులే ముందుకు వచ్చి గుంతలను పూడ్చే ప్రయత్నం చేశారు. గుంతలను మట్టిని పోసిపూడ్చివేశారు. మళ్లీ చిన్న వర్షానికే ఆ మట్టి కొట్టుకుపోయింది. అధికారులు రోడ్డుపై ఏర్పడిన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
గంతలు పూడ్చాలి
భగత్‌నగర్‌లోని శివాలయం ప్రాంతంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలి. గుంతల వల్ల కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులపై ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదు. – వెంకన్న, భగత్‌నగర్, కరీంనగర్