
వేగంగా అభివృద్ధి పనులు
చిగురుమామిడి: హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం చిగురుమామిడి మండలంలో పర్యటించారు. సీతారాంపూర్– పీచుపల్లి– తిమ్మాపూర్ మండలం పర్లపల్లి వరకు రూ.5కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. స్వశక్తి సంఘాల మహిళలకు స్టీల్ సామగ్రి పంపిణీ చేశారు. సుందరగిరి ఎస్సీ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే సీసీరోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, చిగురుమామిడి ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.