
ఎమ్మెల్యే ‘కవ్వంపల్లి’కి నిరసన సెగ
తిమ్మాపూర్: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం వచ్చారు. ఆయన వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. బాలయ్యపల్లి, సాయబ్‌పల్లి గ్రామాలను గత ప్రభుత్వం ఒకే పంచాయతీగా ఏర్పాటు చేసింది. పంచాయతీ భవనాన్ని సాయబ్‌పల్లిలో నిర్మించాలన్న ఎమ్మెల్యే నిర్ణయాన్ని బాలయ్యపల్లివాసులు వ్యతిరేకించారు. రెండు గ్రామాల మధ్యలో లేదా బాలయ్యపల్లిలోనే నిర్మించాలని కోరారు. ఉదయం సాయబ్‌పల్లిలో భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ముగ్గు పోస్తుండగా, బాలయ్యపల్లి వాసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎల్‌ఎండీ ఎస్సై శ్రీకాంత్ ఆరుగురు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు.