
నేతన్న కంట్లో దిగిన జోటా
సిరిసిల్లటౌన్: సాంచాలు నడుపుతున్న నేతకార్మికుడి కంట్లో ప్రమాదవశాత్తు జోటా వచ్చి పడింది. నరాలు దెబ్బతిని కంటి చూపు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌కు చెందిన సబ్బని ధర్మేందర్ సాంచాల కార్ఖానాలో బొప్ప రాజనర్సయ్య(56) సాంచాలు నడిపిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం జోటా ఎగిరివచ్చి ఎడమ కంటికి తగిలింది. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానిక ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షలు చేసి ఆపరేషన్ కోసం హైదరాబాద్‌కు పంపించారు. అక్కడి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు బుధవారం రాజనర్సయ్యకు ఆపరేషన్ చేశారు. కంట్లో నాడీవ్యవస్థ దెబ్బతినడంతో చూపు పోయిందని తెలిపారని రాజనర్సయ్య బంధువులు ఆవేదనతో చెప్పారు. చేతిలో పైసల్లేని కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద రూ.లక్షకు పైగా అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. అత్యవసర ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీ వర్తించలేదని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
సాంచాలు నడుపుతుండగా ప్రమాదం
చూపు కోల్పోయిన కార్మికుడు