
పసిగడుతూ.. పట్టిస్తూ..!
పలు నేరాల్లో కీలక సమాచారం
● కేసుల దర్యాప్తులో జాగిలాల పాత్ర
● కీలక సమాచారం అందిస్తున్న శునకాలు
● ఆ దిశగానే పోలీసుల ప్రత్యేక పరిశోధనలు
జగిత్యాలజోన్: జిల్లాలో ఇటీవల జరిగిన పలు మర్డర్లు, దొంగతనాల్లో అనుమానితులను కనిపెట్ట డంలో పోలీసు జాగిలాలు కీలకంగా మారుతున్నాయి. ఆయా కేసుల్లో పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అందిస్తూ కేసు దర్యాప్తులో సహకరిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడ ఏ నేరం జరిగినా ముందుగా పోలీసు జాగిలాలు సంఘటన స్థలానికి చేరుకుంటున్నాయి. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను కనిపెట్టడం.. పేలుడు పదార్థాలను ముందే పసిగట్టి ప్రమాదాలు జరగుకుండా చూడడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
● నేరం జరిగిదంటే జాగిలం రంగ ప్రవేశం
దొంగతనాలు, అనుమానిత హత్యలు జరిగినప్పుడు జాగిలం రంగ ప్రవేశం చేసి పోలీసులకు కీలక సమాచారాన్ని అందిస్తుంది. భారీ బహిరంగ సభలు, మంత్రుల సమావేశాలు జరిగినప్పుడు పరిసరాలను కలియతిరిగి ఓకే చెప్పిన తర్వాతనే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జాగిలానికి ఎక్కడైనా అనుమానం వచ్చిందంటే చాలు.. పోలీసులు పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడ పూర్తిస్థాయిలో శోధిస్తుంటారు. ఏదైనా నేరం జరిగినప్పుడు.. నేరానికి పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పుడు ఆయా పోలీసు స్టేషన్ల ఎస్సైలు ఎస్పీకి సమాచారం ఇస్తారు. ఎస్పీ ఆదేశాల మేరకు జాగిలాలు రంగప్రవేశం చేసి పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంటాయి. జాగిలాలు డ్యూటీలోకి వచ్చినప్పుడు మాత్రమే హ్యాండ్లర్ మెడకు బెల్టుతో పట్టుకుంటాడు. డ్యూటీ అయిపోగానే హ్యాండర్లతో సరదాగా ఆడుకుంటుంది.
● రాష్ట్రస్థాయిలో ప్రత్యేక శిక్షణ
తొలుత జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎంపిక చేసుకున్న అన్ని జాగిలాలకు ఒకే రకమైన శిక్షణ కాకుండా చురుకుగా ఉండేవాటికి సూపర్ స్పెషాలిటీ శిక్షణ ఇస్తారు. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు మాత్రమే ఆ జాగిలాలను ఉపయోగిస్తారు. ప్రభుత్వం కేవలం శిక్షణలోనే పోలీసు జాగిలం, ఇద్దరు హ్యాండర్లకు దాదాపు రూ.4నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. పోలీసు జాగిలం 14 ఏళ్ల వరకు జీవిస్తుంది. అయితే తొమ్మిదేళ్లకే డాగ్‌కు రిటైర్‌మెంట్ ఇస్తారు. రిటైర్‌మెంట్ తర్వాత పోలీసు సంరక్షణలోనే ఉంటుంది. అనారోగ్యంతో మరణిస్తే పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తుంటారు. వీటికి కూడా డ్యూటీ మీట్‌లు పెట్టి, బంగారం, రజక, కాంస్య పతకాలు అందిస్తారు. వీటికి హోంఫుడ్, ప్యాకెట్ ఫుడ్, మిశ్రమ ఆహారాన్ని అందిస్తుంటారు. పోలీసు డాగ్‌ను చూసుకునే హ్యాండ్లర్ మాటలు అర్థమయ్యేలా కమాండ్ పదాలు వాడుతూ.. వాటి మెడను నిమురుతూ ఉంటారు.
హ్యాండ్లర్స్‌తో పోలీసు జాగిలాలు
జాగిలాలతో కలెక్టర్ సత్యప్రసాద్
లాబ్రాడార్, లేట్రీవర్, డాబర్ మాన్, జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన డాగ్‌లను నాలుగు నెలల వయస్సున్నప్పుడే ఎంపిక చేసుకుంటారు. తర్వాత డాగ్స్‌తో పాటు దాన్ని చూసుకునే హ్యాండ్లర్‌కు 8 నెలల పాటు హైదరాబాద్‌లో పలు రకాలుగా శిక్షణ ఇస్తారు. బాంబులను పసిగట్టడం, మాదకద్రవ్యాలను గుర్తించడం, నిందితులను గుర్తించడం వంటివాటిపై శిక్షణ ఇస్తారు. తర్వాత జాగిలం ఎంతవరకు వీటిని పసిగడుతోందో అనేదానిపై మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తారు. శిక్షణలో మొదటి రెండు నెలలపాటు హ్యాండ్లర్ జాగిలాన్ని మచ్చిక చేసుకోవడానికే సరిపోతారు. హ్యాండ్లర్ శిక్షణను ఎప్పటికప్పుడు జాగిలం నేర్చుకుంటూ.. అవసరమైన చోట ఉపయోగిస్తుంటుంది. శిక్షణ అనంతరం ఆయా జిల్లాలకు కేటాయిస్తారు. ప్రస్తుతం జిల్లాలో మూడు జాగిలాలను పోలీసులు అవసరాన్ని బట్టి ఉపయోగిస్తున్నారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో హ్యాండ్లర్ ర్యాంబోకు అవసరమైన ఆహారపదార్థాలు అందిస్తూ.. విధుల్లో చురుకుగా ఉండేందుకు పరుగెత్తించడం, దూకడం వంటివి శిక్షణ ఇస్తుంటారు. వాస్తవానికి జాగిలానికి 100 రేట్లు గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. పోలీసులు జాగిలాలను వివిధ పేర్లతో పిలుస్తూ హ్యాండ్లర్స్ పిల్లల మాదిరిగా చూసుకుంటారు.
నేరాల్లో పోలీసు జాగిలాల ద్వారా కీలక సమాచారం దొరుకుతుంది. అవి ఇచ్చే సూచనల మేరకు పోలీసు బృందాలు వేగవంతంగా దర్యాప్తు చేస్తుంటారు. ఒక్కోసారి గంటల వ్యవధిలోనే నిందితులు పట్టుబడుతున్నారు. పోలీసు జాగిలాలు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండి ముందుకు దూసుకెళ్లుతుండటంతో నేర పరిశోధనలు త్వరగా పూర్తవుతున్నాయి.
– అశోక్‌కుమార్, ఎస్పీ

పసిగడుతూ.. పట్టిస్తూ..!

పసిగడుతూ.. పట్టిస్తూ..!