కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని గణేశ్ మండపాల నిర్వాహకులు, ప్రజలు నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. దీనికోసం పోలీసుశాఖ తరఫున పలు మార్గదర్శకాలు జారీ చేశారు. గణేశ్ మండపాలను ఏర్పాటు చేసేవారు పోలీసు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతిమ ఎత్తు, మండపం ఏర్పాటు చేసే స్థలం, నిమజ్జనం తేదీ, ప్రదేశం వివరాలను తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులు అనుమతులు జారీ చేస్తారన్నారు.
అనుమతి పత్రం, క్యూఆర్ కోడ్, పోలీస్ సూచనలను మండపం వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. మండపం వద్ద 24గంటలు ఒక వలంటీర్ ఉండాలని, కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, లక్కీ డ్రాలు నిర్వహించడం, అసభ్యకర నృత్యాలు చేయడం నిషేధం అన్నారు. పోలీస్ తనిఖీల కోసం మండపం వద్ద పాయింట్ పుస్తకం ఉంచాలన్నారు. అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
1,852 పనులు.. రూ.31.75కోట్లు
కరీంనగర్ అర్బన్: పల్లెల్లో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ నిధులతో పనులను చేపట్టనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనులు జరగనుండగా జిల్లాలో మంత్రి ప్రాతినిథ్యం వహించే మండలాలతో పాటు శాసనసభ్యుల నియోజకవర్గాల్లో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. శుక్రవారం జిల్లాలో రూ.31.75 కోట్ల వ్యయంతో 1,852 పనులను ప్రారంభించనున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ వివిధ ప్రాంతాల్లో పాల్గొననున్నారు. 13 విభాగాల్లో వివిధ పనులు గుర్తించగా జీపీ బిల్డింగులు, అంగన్‌వాడీ బిల్డింగులు, పశువుల పాకలు, గొర్రెలు, మేకల షెడ్లు, పౌల్ట్రీషెడ్లు, అజోల్లా, వర్మీ కంపోస్ట్ పిట్స్, చెక్ డ్యాం, కమ్యూనిటీ కాంప్లెక్స్, మరుగుదొడ్లు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు, సెగ్రిగేషన్ షెడ్లు వంటి పనులు చేపట్టనున్నారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కరీంనగర్‌లోని సంతోష్‌నగర్, భాగ్యనగర్, జ్యోతినగర్, గీతాభవన్ వెనుక ప్రాంతం, కార్పెంటర్ సొసైటీ, సంతోషిమాత, హనుమాన్ దేవాలయాలు, కొత్త లేబర్ అడ్డ, సాయిబాబా దేవాలయం, సెయింట్ జాన్స్ స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.
ట్రాక్టర్ పనిముట్లకు దరఖాస్తులు ఆహ్వానం
కరీంనగర్ అర్బన్: వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాకు ట్రాక్టర్ పనిముట్లు కేటాయించారని, ఆసక్తి ఉన్న రైతులు సెప్టెంబర్ 6 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. 2,822 బ్యాటరీ లేక మాన్యువల్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, 481 పవర్ స్ప్రేయర్లు, 188 రోటవేటర్లు, 32 సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్లర్లు, డిస్క్ హేరో, కల్టివేటర్, కేజ్ వీల్స్, రోటో పడ్లర్ 212, బండ్ ఫార్మర్ 9, పవర్ విడర్ 17, బ్రష్ కట్టర్ 33, పవర్ టిల్లర్ 25, స్ట్రాబెలర్ 29 జిల్లాకు ఇచ్చారని వెల్లడించారు. చిన్న, సన్నకారు, మహిళా, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. అప్లికేషన్ ఫామ్, 2 పాస్‌పోర్ట్ ఫొటోలు, ఆధార్ కార్డు, ట్రాక్టర్ ఆర్సీ, పట్టాదారు పాస్ పుస్తకం, చిన్న, సన్నకారు రైతు పత్రంతో ఆయా రైతు వేదికల్లో గాని, మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో గాని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.