
బల్దియాలో సరెండర్ రగడ!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలో అదనపు కమిషనర్ సువార్త సరెండర్ వ్యవహారం హైడ్రామాను తలపిస్తోంది. ఆమెను సరెండర్ చేసి రెండు రోజులు గడిచినా.. ఇంకా కార్యాలయానికి రావడంతో పాటు, తన చాంబర్ కు తాళం వేసుకోవడం గందరగోళానికి దారితీసింది. ఆ తాళాన్ని పగలగొట్టిన సిబ్బంది చాంబర్ కు మరో తాళం వేశారు. విధుల్లో అలసత్వం, తదితర కారణాలతో ఈ నెల 19వ తేదీన సువార్తను సీడీఎంఏకు సరెండర్ చేయడం తెలిసిందే. అయితే బుధ, గురువారాల్లో ఆమె కార్యాలయానికి వచ్చి చాంబర్‌లో ఉండడంతో చర్చనీయాంశంగా మారింది. ఆమె సరెండర్‌ను రద్దు చేసేందుకు కొంతమంది నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారని, కానీ.. రాజకీయ ఒత్తిళ్లు పెద్దగా ఫలించలేదని ప్రచారంలో ఉంది.
తాళం పగలగొట్టిన సిబ్బంది
అదనపు కమిషనర్ చాంబర్ తాళం గురువారం రాత్రి సిబ్బంది పగలగొట్టారు. అంతకుముందు సువార్త తాళం వేసుకుని వెళ్లడంతో, ఆ తాళాన్ని పగలగొట్టి, కొత్త తాళం వేశారు. చాంబర్ బయట ఉన్న ఆమె నేమ్ ప్లేట్ ను తొలగించారు.
బాధ్యతలు ఇతరులకు..
అదనపు కమిషనర్ సువార్త చూస్తున్న బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగిస్తూ గురువారం రాత్రి కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశాలు జారీచేశారు. ట్యాప్‌సెక్షన్ (డిజిటల్ కీ), నీటి పన్ను వసూళ్లు ఎస్‌ఈ రాజ్‌కుమార్‌కు, ఎస్టాబ్లిష్‌మెంట్, రెవెన్యూ, ప్రజావాణి డిప్యూటీ కమిషనర్–1 ఖాదర్ మొహియొద్దిన్‌కు, శానిటేషన్, ఏబీసీ సెంటర్, ప్రజాదర్బార్(సీఎంవో), ప్రజాపాలన, డంపింగ్‌యార్డ్, కంపోస్టు యూనిట్, డీఆర్‌సీసీ, లైబ్రరీ, బర్త్ అండ్ డెత్ (డిజిటల్ కీ), ట్రేడ్ లైసెన్స్, ఆర్‌టీఐ యాక్ట్–2005లు డిప్యూటీ కమిషనర్–2 వేణు మాధవ్‌కు, మెప్మా, రికార్డు రూమ్, సిటిజన్ సర్వీస్ సెంటర్, ఆడిట్, కోర్టు వ్యవహారాలు, పెన్షన్స్ (డిజిటల్‌కీ), కౌన్సిల్ విభాగాలు సహాయ కమిషనర్ దిలిప్‌కుమార్‌కు అప్పగించారు.