
విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండండి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ప్రమాదాలు జరగకుండా, విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ సూచించారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లోని సమావేశ మందిరంలో గురువారం విద్యుత్ సరఫరా.. ప్రమాదాలు.. తీసుకోవల్సిన జాగ్రత్తలు.. కేబుల్ వైర్ల తొలగింపు.. తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ సంస్థలతో కలిసి నగరాలు, పట్టణాల్లో ఉన్న కేబుల్ వైర్లను తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖలోని సిబ్బంది తప్పిదాలు ప్రాణాపాయానికి దారి తీసే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో వినాయకుల ప్రతిమలను తరలించే క్రమంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతకుముందు స్థానిక బ్యాంకుకాలనీ సబ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ కంట్రోల్ పనితీరును తనిఖీ చేశారు. హెచ్‌టీ సర్వీసుల మోడేముల ఆటోమేటిక్ మీటర్ రీడింగులను పరిశీలించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఉద్యోగులు పని చేయాలని, జిల్లాలో టీమ్స్‌వారీగా విద్యుత్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. చీఫ్ ఇంజనీరు ఆపరేషన్ బి.అశోక్, ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, డీఈలు ఉపేందర్, జంపాల రాజం, పి.చంద్రమౌళి, ఎం.తిరుపతి, ఎస్.లక్ష్మారెడ్డి, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్, ఏడీలు ఎన్.అంజయ్య, జి.శ్రీనివాస్, ఎం.లావణ్య, ఏవోలు, ఏఏవోలు, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.