
టీచర్ల పదోన్నతులు షురూ
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం గత నెలలోనే నిర్వహించాల్సి ఉండగా పీజీహెచ్‌ఎం గ్రేడ్–1 పదోన్నతుల ప్రక్రియలో కొందరు కోర్టును ఆశ్రయించడంతో వాయిదా పడింది. అయితే కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖను హైకోర్టు ఆదేశించడంతో పదోన్నతుల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా పీజీహెచ్‌ఎం గ్రేడ్ మల్టీజోన్–1కు సంబంధించి పదోన్నతులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు(లోకల్‌బాడీ) పదోన్నతు ఉత్తర్వులను దాదాపు 90 మంది హెచ్‌ఎంలకు గురువారం రాత్రి అందజేశారు. వారు తక్షణమే పనిచేస్తున్న పాఠశాల నుంచి రిలీవ్ కావాలని, పోస్టింగ్ పొందిన స్కూల్‌లో శుక్రవారం జాయిన్ కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
నేడు సీనియార్టీ జాబితా విడుదల
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన వారి ఖాళీ స్థానాలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్‌జీటీ)తో భర్తీ చేసేందుకు పదోన్నతుల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలుకానుంది. 22న సీనియార్టీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పొందపర్చనున్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే డీఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. 23న ఎస్‌జీటీల నుంచి వివిధ కేటగిరీలలోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన వారి జాబితాను ప్రదర్శించనున్నారు. 24, 25, 26వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు వారి స్థానాల నుంచి రిలీవ్ అయి కొత్తగా పదోన్నతులు పొందిన పాఠశాలల్లో చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు.