
అపరిశుభ్రం.. అధ్వానం
కరీంనగర్ అర్బన్: ముడి పదార్థాలపై బల్లుల మలం.. ఈగలు, దోమలు, పరిసరాలు అపరిశుభ్రం ఇదీ పలు బేకరీల్లో వెలుగు చూసిన నిజం. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల క్రమంలో కరీంనగర్‌లోని పలు బేకరీలు, స్వీట్ షాపులను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఖలీల్, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ రోహిత్ రెడ్డి, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ అంకిత్‌రెడ్డి తనిఖీ చేశారు. టవర్ సర్కిల్ లోని అనిల్ స్వీట్స్, బేకరి, ఆనంద్ స్వీట్స్, ముకరంపురలోని మహారాజా స్వీట్ దుకాణాన్ని తనిఖీ చేయగా అపరిశుభ్ర వాతావరణం గుర్తించినట్లు వివరించారు. స్వీట్స్ భద్రపరచడంలో లోపాలు ఉన్నాయని వెల్లడించారు. స్వీట్స్‌పైన బళ్లుల మలం గుర్తించగా, కిచెన్‌లో డ్రైనేజ్ బ్లాక్ అవ్వడంతో దుర్వాసనతో పాటు పాలలో ఈగలు, దోమలు పడి ఉన్నాయని తెలిపారు. స్వీట్స్ తయారీలో పరిమితికి మించి ఆర్టిసిఫియల్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నారన్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వివరించారు.
స్వీట్‌షాపుల్లో అధికారుల తనిఖీలు