
టెక్స్‌టైల్ పార్కు కార్మికుల మెరుపు సమ్మె
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పవర్లూమ్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి–సారంపల్లి టెక్స్‌టైల్ పార్కులో వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. తమ కూలి రేట్లను పెంచాలని కోరుతూ కార్మికులు మంగళవారం మెరుపు సమ్మెకు దిగినట్లు సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులకు రోజూ రూ.1,000 వేతనం చెల్లించేలా కూలి రేట్లను సవరించాలన్నారు. అలాగే ఒప్పంద గడువు ముగిసన ప్రైవేటు వస్త్రానికి 10 పిక్కులకు రూ.50 పైసలు పెంచాలన్నారు. యజమానులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం చేస్తామన్నారు. టెక్స్‌టైల్ పార్కు పవర్లూమ్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు వస్త్రాలకు సంబందించి యజమానులు కూలి పెంచే వరకు కార్మికులు ఎవరూ పనులకు వెళ్లకూడదని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం గేటు వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్మిక నాయకులు సదానందం, సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.