రేకుర్తిలో నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్, లోన్లు
వెలుగులోకి ‘అట్టారా’ ముఠా ఆగడాలు
2019లో అన్ని రికార్డులు టీపీవోకు అప్పగించిన కార్యదర్శి
గతేడాది ఇదే విషయంపై రూరల్ ఏసీపీకి పాత కార్యదర్శి లేఖ
సహ చట్టంలో అడిగితే లేవంటూ బల్దియా దాటవేత
1,002 నకిలీ ఇంటి నంబర్లలో 800 వరకు రద్దు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కరీంనగర్ శివారులో నకిలీ ఇంటి నంబర్ల దందాలో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. నకిలీ ఇంటి నంబర్లు, నిర్మాణ అనుమతులతో రిజిస్ట్రేషన్లు చేసుకున్న కబ్జాదారులు, ఆ పత్రాలతో బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్న విషయం తెలిసి బాధితులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఈ తతంగాల పై విజిలెన్స్, పోలీసులు వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. నిజనిజాలు తెలుసుకునేందుకు ఇంటి అనుమతుల రిజిష్టర్ కోసం సహచట్టం ద్వారా బా ధితులు దరఖాస్తు చేస్తే బల్దియా అధికారులు తమవద్ద రికార్డులు ప్రస్తుతం అందుబాటులో లేవని దాటవేస్తున్నారు. 2019 మార్చిలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌కు తాను ఇంటి అనుమతులతో పాటు అన్ని రికార్డులను అప్పగించానని రేకుర్తి పాత గ్రామ కార్యదర్శి గతేడాది రూరల్ ఏసీపీకి స్వయంగా లేఖ రాయడం గమనార్హం. దీంతో బల్దియా అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇంటినంబర్ల సమాచారాన్ని తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది.
పేరు లేకున్నా రిజిస్ట్రేషన్
రేకుర్తిలో సర్వే నంబరు 67లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు.. ఖాళీగా ఉన్న నాలుగు గుంటల భూమిని ‘అట్టారా’ ముఠా తెలివిగా కాజేసింది. గతంలో ఇది 18వ డివిజన్‌గా ఉండేది. ఖాళీ భూములకు నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం, ఆక్రమించుకోవడం ఈ గ్యాంగ్ దినచర్య. గతంలో ఆక్రమించుకున్న ఓ భూమి కేసు ప్రస్తుతం వీరి మెడకు చుట్టుకుంది. ఆ సమయంలో రెండు ప్లాట్లను గంగాధర సబ్‌రిజిస్ట్రా ర్ వద్ద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయంపై సీఎం కార్యాలయం ఆదేశాలతో ప్రస్తు తం కొత్తపల్లి పోలీసులు విచారణ జరపుతున్నారు. అసలు ఆజ్ఞా పత్రాల్లో దరఖాస్తుదారుల పేర్లు లేకున్నా.. సబ్‌రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం చూసి పోలీసులే ముక్కున వేసుకున్నారు.
అవే కాగితాలతో బ్యాంకుల్లో లోన్లు..
వీరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి అసలు యజ మానులను బెదిరించడమే కాదు.. పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటారు. అప్పుడు భూమి అసలు యజమాని.. ఇటు కబ్జాదారులతో, అటు రుణాలి చ్చిన బ్యాంకులతో ఒకేసారి న్యాయపోరాటం చే యాల్సిన దుస్థితి కల్పిస్తారు. తప్పుడు ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుని, బ్యాంకుల్లో కుదవపెట్టి.. అట్టారా ముఠా రూ.కోట్లు సంపాదించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్, బల్దియా కమి షనర్, సీపీ ఈ విషయంలో జోక్యం చేసుకుని లోతుగా విచారణ చేపట్టాలని స్థానికులు విన్నవిస్తున్నారు. ఇటీవల బల్దియా పరిధిలో 1,002లో వివాదాస్పద ఇంటినంబర్లలో మెజారిటీ ఇదే తరహాలో ఉన్నాయి. ఇప్పటి వరకు 800వరకు రద్దు చేయగా.. మిగిలిన 200 కూడా త్వరలో రద్దు చేస్తామని బల్దియా అధికారులు ‘సాక్షి’కి వివరించారు.
కబ్జా.. బ్యాంకు రుణం!