
కేబుల్ వైర్ల తొలగింపు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్ల తొలగింపు పనులకు విద్యుత్‌శాఖ శ్రీకారం చుట్టింది. గత కొన్నేళ్లుగా పట్టించుకోకుండా వ్యవహరించిన విద్యుత్‌శాఖలో సోమవారం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో జరిగిన ఘటనతో కదలిక వచ్చింది. ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చవితి, తరువాత దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిమల తరలింపు సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చేసేందుకు అప్రమత్తమైంది. సీఎండీ వరుణ్‌రెడ్డి ఆదేశాలతో ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, డీఈలు ఉపేందర్, జంపాల రాజం విద్యుత్ స్తంభాలు, వైర్లకు సమీపంలో ఉన్న కేబుళ్లు, డిష్‌వైర్ల తొలగింపు పనులు చేపట్టారు.
విద్యుత్ స్తంభాలపై అస్తవ్యస్తంగా వైర్లు
నగరరంలోని విద్యుత్ స్తంభాలపై కేబుల్‌వైర్లు వేలా డుతున్నాయి. ఇంటర్‌నెట్, కేబుల్‌వైర్లను విద్యుత్ స్తంభాలపై గల 33, 11 కేవీ వైర్ల సమీపం నుంచి వైర్లు లాగుతున్నారు. మెయింటెనెన్స్‌పై దృష్టి సా రించకపోవడంతో ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యుత్‌శాఖకు రెవెన్యూ చెల్లించకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నారు. చూసిచూడనట్లు వ్యవహరించిన అధికారులు హైదరాబాద్ ఘటనతో అప్రమత్తమయ్యారు. కేబుళ్లు, ఇంటర్‌నెట్ వైర్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయా కంపెనీల ఇంటర్‌నెట్లు, కేబుల్ వాడుతున్న వినియోగదారులకు అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల్లో కేబుల్, ఇంటర్‌నెట్ కేబుళ్లను సరి చేసుకోవాలని విద్యుత్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
కేబుల్ వైర్లు తొలగించండి
విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్, ఇంటర్‌నెట్ వైర్లను వెంటనే తొలగించాలి. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా విద్యుత్ అధికారులు వ్యవహరించాలి. ఒక పద్ధతి ప్రకారం కేబుల్ వైర్లు అమర్చుకోవాలి. వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల క్లియరెన్స్ చేపట్టాలి. వినాయక నిమజ్జన రూట్లన్నీ తనిఖీ చేపట్టి క్లియరెన్స్ ఉండేలా సత్వర చర్యలు తీసుకోవాలి.
– వరుణ్‌రెడ్డి, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ