
సుడా.. గడబిడ!
● టెండర్ ఖరారు కాకుండానే శంకుస్థాపన ● కాంట్రాక్టర్‌వి తప్పుడు పత్రాలంటూ మాజీ మేయర్ ఫిర్యాదు ● వివాదంలో ఐడీఎస్‌ఎంటీ కాంప్లెక్స్ ఆధునీకరణ
కరీంనగర్ కార్పొరేషన్: ఐడీఎస్‌ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులు వివాదంలో పడ్డాయి. ఓ వైపు టెండర్ ఖరారు కాకుండానే శంకుస్థాపన చేయడాన్ని పలువురు తప్పు పడుతుండగా, మరోవైపు టెండర్‌లో తప్పుడు పత్రాలు అందజేసిన కాంట్రాక్టర్‌పై చర్యతీసుకోవాలని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఫిర్యాదు చేశారు.
ఖరారు కాని టెండర్
నగరంలోని పాత మున్సిపల్ అతిథిగృహం స్థలంలో దాదాపు పదేళ్ల క్రితం నిర్మించిన వాణిజ్య భవన సముదాయం నిరుపయోగంగా ఉంది. ఈ సముదాయాన్ని సుడా నిధులు రూ.79 లక్షలతో ఆధునీకరించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం గత నెలలో టెండర్ పిలిచారు. ఈ టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, ప్రైస్ బిడ్ ఓపెన్ చేయాల్సి ఉంది. టెక్నికల్ బిడ్ ఓపెన్‌చేసిన తరువాత, బిడ్‌లో పాల్గొన్న కాంట్రాక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు అందజేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు సరైనవే అయితే, ఆ తరువాత ప్రైస్‌బిడ్ ఓపెన్ చేస్తారు. అందులో ఎవరు లెస్‌కు వేస్తే వారికి టెండర్ ఖరారు అవుతుంది. షాపింగ్ కాంప్లెక్స్ పనుల్లో ఇప్పటివరకు టెండర్ ఖరారు కాలేదు. అయినప్పటికి ఈ నెల 11వ తేదీన ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఓ కాంట్రాక్టర్ తనకే పనులు అప్పగించినట్లు వ్యవహరించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పలు అనుమానాలకు తావిస్తోంది.
కాంట్రాక్టర్‌వి తప్పుడు పత్రాలు: రవీందర్ సింగ్
షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనుల టెండర్‌లో తప్పుడు పత్రాలు అందజేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని మాజీ మేయర్‌సర్ధార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. టెండర్‌లో ఇద్దరు పాల్గొన్నారని, ఇప్పటివరకు ఆ టెండర్ ఖరారు కాలేదన్నారు. కాని ఒక కాంట్రాక్టర్ అందజేసిన పత్రాలన్నీ తప్పువేనన్నారు. ఆ సంస్థకు ఎలాంటి పరికరాలు, వాహనాలు, ల్యాబ్ లేవని, కాని ఇవన్నీ ఉన్నట్లు పత్రాలు అందచేశారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పరిపాలన మంజూరు ఉంది
షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులకు సంబంధించిన టెండర్ ఖరారు కావాల్సి ఉంది. అయితే సుడా పరిపాలనా మంజూరు ఇవ్వడంతో శంకుస్థాపన చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తాం.
– యాదగిరి, ఈఈ, కరీంనగర్ కార్పొరేషన్

సుడా.. గడబిడ!