
‘బుధవారం బోధన’తో ఆత్మవిశ్వాసం
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థులకు కఠినమైన అంశాలు, పాఠాలు నేర్పించి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకే ‘బుధవారం బోధన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. కొత్తపల్లి మండలం ఎలగందుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బుధవారం బోధన కార్యక్రమానికి హాజరై పదోతరగతి విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయించారు. ఇంగ్లిష్ సమర్థవంతంగా నేర్చుకోవడానికి చక్కటి వేదిక అన్నారు. బుధవారం బోధన రోజు విద్యార్థులు నూరుశాతం హాజరయ్యేలా చూడాలన్నారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, విటమిన్ గార్డెన్ పరిశీలించారు. అనంతరం ఎలగందులలోని పల్లె దవాఖానాను సందర్శించి, ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు, ఆరోగ్య మహిళ వైద్య పరీక్షల రిజిస్టర్‌ను పరిశీలించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, ఎంఈవో ఆనందం పాల్గొన్నారు.
నాలా నిర్మాణాలు చేపట్టాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ముంపు సమస్యాత్మక ప్రాంతాల్లోని నాలాల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్, నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ముంపు సమస్య ఉన్న ప్రాంతాలను బుధవారం సందర్శించారు. టూటౌన్‌పోలీసుస్టేషన్ వద్ద ఉన్న నాలా, ఆర్టీసీ వర్క్‌షాప్ తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. జగిత్యాల రోడ్డులో మంజూరైన నా లా నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. టూటౌన్ వద్దగల నాలా పునర్నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)ను సందర్శించి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కంట్రోల్ సెంటర్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీపీ గౌస్‌ఆలం, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ పాల్గొన్నారు.