
సహకారం.. సందిగ్ధం
● సహకార సంఘాలకు ఎన్నికలా.. నామినేటెడా.? ● నేటితో ముగియనున్న పాలకవర్గాల గడువు ● సందిగ్ధంలో సహకార పాలన ● అధికారుల్లో అంతర్మథనం
కరీంనగర్ అర్బన్: ప్రాథమిక సహకార సంఘాల పరిపాలన సందిగ్ధంలో పడింది. సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా.. మళ్లీ పాలకవర్గాల గడువు పొడిగిస్తారా లేక నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తారా అన్నది స్పష్టత లేకపోగా అధికారులకు తలకుమించిన భారమవుతోంది. నేటితో పాలకవర్గాల గడువు ముగియనుండగా ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగగా వాస్తవానికి 6 నెలల క్రితమే గడువు ముగియగా మరో 6నెలలు పొడిగించిన విషయం విదితమే. సదరు గడువు గురువారంతో ముగియనుండటంతో అధికారులకు ఇంకా ఎలాంటి సమాచారం లేకపోవ డం విస్తుగొల్పుతోంది. ఉమ్మడి కరీంనగర్ డీసీసీబీ పరిధిలో 135 ప్రాథమిక సహకార సంఘాలుండగా ఈ నెల 14తో గడువు ముగుస్తుండగా 15న సహకార సంఘాల, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల ఎదుట జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం ఉంటుందా లేదా అని అధ్యక్షుల్లో ఆందోళన నెలకొంది.
స్థానిక ఎన్నికల తరువాతే?
సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిన దరిమిలా ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 42శాతం బీసీ రిజర్వేషన్ క్రమంలో సదరు ప్రక్రియ ఆలస్యమవుతుండగా సహకార ఎన్నికలు ఇప్పట్లో ఉండే అవకాశఽం లేదని తెలుస్తోంది. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తదుపరి సర్పంచ్, మునిసిపాలిటీ ఎన్నికలు జరగనుండగా ఆయా ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం నాలుగు నెలలు పట్టనుంది. స్థానిక సంస్థల పోరు అనంతరం సొసైటీ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. నేరుగా రైతులతో సంబంధాలు కలిగిన పదవి కావడం, రుణాలతో ముడిపడి ఉండడంతో సేవచేసే అవకాశం కోసం మండల స్థాయి చైర్మన్ పదవికి పోటీ ఏర్పడనుంది. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల విధానం పాటిస్తారా.. లేదా.. అన్నది తెలియడం లేదు.
నామినేట్ చేసే అవకాశం
ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో వ్యవహారం కావడంతో నామినేట్ చేసేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో 30, జగిత్యాల 51, రాజన్న సిరిసిల్ల 24, పెద్దపల్లి జిల్లాలో 20 సహకార సంఘాలున్నాయి. నామినేటేడ్ చేసే అవకాశాలే ఎక్కువని ఉన్నతాధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. సదరు విధానంతో పార్టీలో కష్ట పడి పనిచేసిన వ్యక్తికి పదవి కట్టబెట్టినట్లవుతుందని ప్రజాప్రతినిధులు సైతం యోచిస్తున్నారు. కాగా ప్రత్యేక పాలన విధిస్తారా.. లేదా.. అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదని సహకార శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు.