కరీంనగర్‌క్రైం: హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. గురువారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. చర్మానికి, పర్యావరణానికి హానికరం కాని సహజరంగులు ఉపయోగించాలని, ఇతరులపై బలవంతంగా రంగులు వేయడం, శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుందన్నారు. నదులు, చెరువులు, కుంటల వద్ద స్నానాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
లావాదేవీల వివరాలు నమోదు చేయండి
కరీంనగర్‌రూరల్: క్రిమిసంహారక మందుల వ్యాపార లావాదేవీల వివరాలు ప్రతీ నెల 15వ తేదీలోగా ఆన్‌లైన్ లైసెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఓఎల్‌ఎంఎస్)లో డీలర్లు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి జె.భాగ్యలక్ష్మి సూచించారు. గురువారం కరీంనగర్‌లోని టీటీడీ కల్యాణమండపంలో నిర్వహించిన డివిజన్‌స్థాయి క్రిమిసంహారక మందుల డీలర్ల సమావేశంలో మాట్లాడారు. వచ్చే వానాకాలం సీజన్‌కు ముందస్తుగా అవసరమైన పత్తి, ఇతర పంటల విత్తనాలు, సరిపడా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాల్లో పత్తి లూజు విత్తనాలు, కల్తీ విత్తనాలను విక్రయిస్తే వ్యవసాయశాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఏడీఏ రణధీర్‌కుమార్, ఏవోలు హరిత, బి.సత్యం, ఎం.కృష్ణ, డీలర్లు పాల్గొన్నారు.
పత్తి మార్కెట్‌కు మూడురోజులు సెలవు
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిలకడగా కొనసాగుతుంది. గురువారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,150 పలికింది. మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ. 6,750 ప్రైవేటు వ్యాపారులు చెల్లించారు. కాగా మార్కెట్ యార్డుకు శుక్రవారం హోలీ పండుగ, శని, ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయని, సోమవారం యథావిధిగా కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు.
అంతర్జాతీయ చలనచిత్ర జ్యూరీ సభ్యుడిగా రవిచంద్ర
కరీంనగర్‌కల్చరల్: నేపాల్‌లో ఈ నెల 19 నుంచి 25 వరకు జరిగే అంతర్జాతీయ 8వ చలన చిత్రోత్సవానికి జ్యూరీ సభ్యుడిగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు డా.పొన్నం రవిచంద్ర ఎంపికయ్యారు. వారంరోజుల పాటు నేపాల్‌లోని ఖాట్మండులో జరగనున్న చిత్రోత్సవానికి రవిచంద్రతో పాటు నేపాల్‌కు చెందిన రక్షయసింగ్‌రాణా, స్పెయిన్ దేశానికి చెందిన జోవాన్ మార్క్ మొంటియల్ దీయాజ్‌ను నియమించినట్లు ఫెస్టివల్ చైర్‌పర్సన్ కేపీ పాఠక్ తెలిపారు.
హోలీ పండుగ ప్రశాంతంగా జరుపుకుందాం
హోలీ పండుగ ప్రశాంతంగా జరుపుకుందాం