హుజూరాబాద్‌లో ప్రైవేట్‌ క్లినిక్‌ల తనిఖీ | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌లో ప్రైవేట్‌ క్లినిక్‌ల తనిఖీ

Published Sat, May 25 2024 1:00 AM

హుజూరాబాద్‌లో   ప్రైవేట్‌ క్లినిక్‌ల తనిఖీ

● తాళంవేసి పారిపోయిన యజమానులు

హుజూరాబాద్‌: టీఎస్‌ఎంసీ సభ్యులు డాక్టర్‌ నరేశ్‌ కుమార్‌, రాజ్‌కుమార్‌ నేతృత్వంలోని వైద్య బృందం శుక్రవారం హుజూరాబాద్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. టీఎస్‌ఎంసీ చైర్మన్‌ డాక్టర్‌ మహేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇటీవల ఓ కంటి వైద్య శిబిరంలో సుమారు 400మందికి చుక్కలమందు వేసి పొరలు తీసివేసినట్లు వీడియో వైరల్‌ కావడంతో సదరు చికిత్స కేంద్రాన్ని తనిఖీ చేశారు. నిర్వాహకుడు ఆయుర్వేద వైద్యవిద్య, నాచురోపతీలో ఓపెన్‌ డిగ్రీ చేసినట్టుగా సర్టిఫికెట్లు చూపించాడు. కాగా ఆయుర్వేద కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ కానీ, ఆ చికిత్స కేంద్రానికి జిల్లా రిజిస్ట్రేషన్‌ అథారిటీ నుంచి అనుమతులు లేవని గుర్తించారు. హుజూరాబాద్‌లోని మార్కెట్‌రోడ్‌లో ఉన్న సంజీవని పాలిక్లినిక్‌, శ్రీరామ పాలిక్లినిక్‌, సూర్య పాలిక్లినిక్‌ల్లో తనిఖీ చేశారు. అనుమతి లేని సెంటర్లను సీజ్‌ చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి సిఫార్సు చేయనునున్నట్లు తెలిపారు. టీఎస్‌ఎంసీ వైద్యబృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలువురు తమ క్లినిక్‌లకు తాళాలు వేశారు. ఈ తనిఖీల్లో జిల్లా ఐఎంఏ సెక్రటరీ డాక్టర్‌ వెంకట్‌రెడ్డి, హెచ్‌ఆర్‌డీఏ సెక్రటరీ శరణ్‌సాయి, పసుల గౌతం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement