
‘జ్యోతిష్మతి’ విద్యార్థులతో వెబినార్
తిమ్మాపూర్(మానకొండూర్): మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ ఇంజినీరింగ్ కళాశాల, అమెరికాలోని లూసియానా టెక్ యూనివర్సిటీ మధ్య ఇటీవల ఎంవోయూ కుదిరింది. ఈ మేరకు జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు వర్సిటీ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డైరెక్టర్ జేఆర్.లిగాన్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ రీసెర్చ్ డీన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ప్రొఫెసర్ బి.రాము రామచంద్రన్ ఎంఎస్ కోర్సు అడ్మిషన్స్‌పై శుక్రవారం వెబినార్ నిర్వహించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నత విద్యలో భాగంగా అడ్మిషన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్కాలర్‌షిప్స్, ప్రాంగణ నియామకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏటా ఫిబ్రవరి, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించే అడ్మిషన్ల ప్రక్రియకు సన్నద్ధం కావాలని, ఏజెంట్లను సంప్రదించి ఇబ్బందుల్లో పడొద్దని సూచించారు. జ్యోతిష్మతి కళాశాల విద్యార్థులు లూసియా టెక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను సులభంగా అభ్యసించవచ్చని తెలిపారు. అనంతరం కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు మాట్లాడుతూ.. లూసియానా యూనివర్సిటీతో తమ కళాశాల ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. విదేశాలకు వెళ్లి, ఉన్నత చదువులు చదువుకోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, డీన్ అకాడమిక్స్ పీకే.వైశాలి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎంఎస్ అడ్మిషన్స్‌పై లూసియానా వర్సిటీ ప్రతినిధుల అవగాహన

‘జ్యోతిష్మతి’ విద్యార్థులతో వెబినార్