కలిసొచ్చిన కరీంనగర్‌ గడ్డపై నుంచే.. ప్రచారానికి శ్రీకారం! | - | Sakshi
Sakshi News home page

కలిసొచ్చిన కరీంనగర్‌ గడ్డపై నుంచే.. ప్రచారానికి శ్రీకారం!

Mar 12 2024 8:05 AM | Updated on Mar 12 2024 9:33 AM

- - Sakshi

జిల్లా కేంద్రంలో గులాబీ జెండాలతో ముస్తాబైన కూడళి

ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న నాటి టీఆర్‌ఎస్‌, ప్రస్తుత బీఆర్‌ఎస్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న నాటి టీఆర్‌ఎస్‌, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ పార్టీ కలిసొచ్చిన కరీంనగర్‌ గడ్డపై నుంచే పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఎస్సారార్‌ కళాశాల గ్రౌండ్‌లో లక్ష మందితో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా ‘కరీంనగర్‌ కదనభేరి’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన అనంతరం పార్టీ అధినేత కేసీఆర్‌ మొదటిసారిగా కరీంనగర్‌కు రానున్న నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈనెల 7న కరీంనగర్‌లో సమావేశం ఏర్పాటు చేసి సభ ఏర్పాట్లు, కాంగ్రెస్‌, బీజేపీల వైఖరి, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ కరీంనగర్‌లోనే మకాం వేసి వారం రోజులుగా సభ ఏర్పాట్లపై కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు.

లక్ష మంది సమీకరణకు..
కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజక వర్గాల నుంచి లక్ష మందికిపైగా జనాన్ని సమీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌, కరీంనగర్‌, సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించగా చొప్పదండి, మానకొండూర్‌, హుస్నాబాద్‌, వేములవాడలో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. పార్లమెంట్‌ పరిధిలో వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎస్‌కే 5వేల పైచిలుకు ఓట్లు అధికంగా వచ్చిన విషయాన్ని కార్యకర్తలకు వివరిస్తూ భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు 5,12,352 ఓట్లు రాగా బీఆర్‌ఎస్‌కు 5,17,601, బీజేపీకి 2,50,400 ఓట్లు వచ్చాయని, పార్లమెంట్‌ పరిధిలో అసెంబ్లీ సీట్ల సంఖ్య తగ్గినా ఐదువేల పైచిలుకు మెజార్టీ బీఆర్‌ఎస్‌కే ఉందని, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు తథ్యమనే వాదనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచాయని, వారు ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలు అసహనంతో ఉన్నారని, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పెద్దగా ఏమీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి ఎంపీ సీట్లను బీఆర్‌ఎస్‌ కై వసం చేసుకునే దిశగా కార్యకర్తల్లో మనోనిబ్బరాన్ని నింపుతున్నారు.

నగరం గులాబీమయం!
కరీంనగర్‌ ‘కదనభేరి’ బహిరంగ సభ ఏర్పాట్లతో నగరం గులాబీమయమైంది. ప్రధాన కూడళ్లతో పాటు ఎస్సారార్‌ కళాశాలకు వెళ్లే రహదారి మొత్తం గులాబీ జెండాలు, పార్టీ అధినేతల కటౌట్లతో సిద్ధం చేశారు. ఎస్సారార్‌ మైదానంలో సభ ఏర్పాట్లకు సంబంధించి వాహనాల పార్కింగ్‌, తదితర పనులన్నీ పూర్తయ్యాయి.

ఇవి చదవండి: అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement