నా ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారణం! | - | Sakshi
Sakshi News home page

నా ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారణం!

Jan 2 2024 12:30 AM | Updated on Jan 2 2024 8:59 AM

- - Sakshi

కరీంనగర్: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇందుకు ఆ ముగ్గురే కారణం..’ అంటూ ఓ యువకుడి సూసైడ్‌నోట్‌ సిరిసిల్లలో సోమవారం కలకలం సృష్టించింది. బాధితుడు మీడియా ప్రతినిధులకు నేరుగా వాట్సాప్‌లో పంపించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్లకు చెందిన ఓ ప్రముఖుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశాడు. ఎన్నికల్లో అతని విజయం కోసం ఆ యువకుడితోపాటు అతని స్నేహితులు పనిచేసేందుకు రూ.లక్ష పారితోషికం మాట్లాడుకున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో అతను.. లేదంటే ఓ జాతీయ పార్టీ ప్రతినిధి గెలుస్తారని.. మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పుకొచ్చాడని పేర్కొన్నారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపైనే కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయాడు. చేసిన పనికి డబ్బులు రాక తనతోపాటు స్నేహితులు కూడా ఇబ్బందుల పడుతున్నారని పేర్కొన్నాడు. ఎమ్మెల్యేగా పోటీచేసిన సదరు అభ్యర్థి, అతని సడ్డకుడు, పద్మశాలి వర్గానికి చెందిన మరో నాయకుడు కలిసి మోసం చేశారని, తన ఆత్మహత్యకు వారే కారణం అంటూ ఆ నోట్‌ రాసుకొచ్చాడు. ఈ విషయంపై సిరిసిల్ల పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ముఖ్య గమని​క: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

ఇవి చ‌ద‌వండి: న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం!

Advertisement
 
Advertisement
Advertisement