
వీధిలో తిరుగుతున్న వానరాలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ స్మార్ట్ సిటీ కొన్ని రోజుల నుంచి కోతుల బెడదతో నానా తంటాలు పడుతోంది. సిటీలోని పలు వీధుల్లో వానరాలు బీభత్సం సృష్టించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వీధుల్లో కుక్కల బెడద ఉండగా.. ఇటీవలీ కాలంలో తగ్గింది. తీరా కుక్కల బెడద తగ్గిందని అనుకున్న సీటిజన్లకు అంతలోనే కోతుల బెడద వచ్చి పడింది. వీధుల్లోని ఇళ్లలోకి కోతులు చొరబడి రచ్చరచ్చ చేస్తున్నాయని, ఎదురు తిరిగితే పైకి వచ్చి కొరుకుతున్నాయని వాపోతున్నారు. హోటళ్లు, పండ్ల దుకాణాలు తదితర వ్యాపార కేంద్రాల్లో కోతులు చొరబడి నానా బీభత్సం సృష్టిస్తున్నాయంటున్నారు. నగరపాలక సంస్థ అధికారులు చొరవ తీసుకొని కోతుల బెడద నుంచి తప్పించాలని కోరుతున్నారు.
గుంపులుగుంపులుగా..
నగరంలోని చాలా డివిజన్లలో కోతులు గుంపులుగుంపులుగా తిరుగుతున్నాయి. ఒకేసారి సుమారు 50కి పైగా కోతులు ఒక్కసారిగా ఇళ్లు, రేకులపైకి ఎక్కి చిందనవందర చేస్తున్నాయి. ఇలా చాలా వీధుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు. కోతులను కట్టిపడేసే మార్గం లేదా అంటున్నారు పలు కాలనీల వాసులు. కోతులు తమ పిల్లలపైకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయంటున్నారు. వెంటనే అధికారులు కోతులన్నింటిని వేరే చోటుకి పంపించే ప్రయత్నాలు చేపట్టాలని కోరుతున్నారు.
వీధుల్లో రచ్చరచ్చ చేస్తున్న వైనం
బెంబేలెత్తుతున్న ప్రజలు, చిన్నారులు

ఇంటిపై కోతులు