TS Karimnagar Assembly Constituency: TS Election 2023: ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు..! కానీ ఇవి చేయడానికి వీల్లేదు..!
Sakshi News home page

TS Election 2023: ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు..! కానీ ఇవి చేయడానికి వీల్లేదు..!

Oct 10 2023 1:04 AM | Updated on Oct 10 2023 8:01 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అసెంబ్లీ ఎన్నికలకు సైరన్‌ మోగింది. ఎన్నికల కమిషన్‌ సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమావేశాలు జరుపరాదు. ఆన్‌ గోయింగ్‌ స్కీంలను కొనసాగించవచ్చు. ఎన్నికల తంతు అధికారికంగా ప్రారంభం కావడంతో పల్లెల్లో, పట్టణాల్లో ప్రచార పర్వం మొదలు కానుంది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించింది.

నెల రోజుల కిందే అభ్యర్థులను ప్రకటించడంతో 10 రోజులుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీసీ చేయూత పథకం, గృహలక్ష్మి, మైనారిటీ, క్రిస్టియన్‌ బంధు పథకాల లబ్ధిదారులకు చెక్కులు అందించే కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పెండింగ్‌ పనుల పూర్తి, హామీలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించి, పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపారు.

అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్‌, బీజేపీ..
శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, అధికార పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్న కాంగ్రెస్‌, బీజేపీలు ఇప్పటివరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల కేడర్‌లో నైరాశ్యం నెలకొంది. పార్టీలపై ప్రజల్లో సానుభూతి ఉన్నా అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమవుతున్నారన్న భావన ఉంది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు దరఖాస్తులు స్వీకరించినా ఖరారు చేయలేదు. ఢిల్లీ, హైదరాబాద్‌ స్థాయిలో టికెట్లను ఆశిస్తున్న నేతలు పైరవీల్లో మునిగిపోయి, అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మిగతా పార్టీల విషయానికోస్తే.. బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఉమ్మడి జిల్లాలో నాలుగు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన ఐదు సీట్లలో పోటీ చేస్తామని నియోజకవర్గాల పేర్లను ప్రకటించిందే తప్ప అభ్యర్థులను వెల్లడించలేదు.

పెరిగిన ఓటర్లు 3.2 లక్షలు..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 31,12, 283 మంది ఓటర్లు ఉన్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 27,88,085 మంది ఓటర్లు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 31.12 లక్షలు దాటింది. మొత్తంగా చూసినప్పుడు ఐదేళ్ల క్రితానికి ఇప్పటికి 3,24,198 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో యువతే ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలు వారిని లక్ష్యంగా చేసుకొని, మేనిఫెస్టో, ప్రచారానికి రూపకల్పన చేస్తున్నాయి.

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా..
నోటిఫికేషన్: నవంబర్ - ౩
నామినేషన్లకు ఆఖరు: నవంబర్ - 10 
నామినేషన్ల పరిశీలన: నవంబర్ - 13 
ఉపసంహరణకు ఆఖరు: నవంబర్ - 15 
పోలింగ్: నవంబర్ - 30
ఓట్ల లెక్కింపు: డిసెంబర్ - 3

ఇవి చేయడానికి వీల్లేదు.
● కోడ్‌ అమల్లోకి వచ్చినందున మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక పర్యటనలు చేయరాదు.
● ప్రభుత్వ పథకాలు, ప్రచారాల పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
● ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన రోజు నుంచే ప్రతీ అభ్యర్థి ఖర్చుపై నిఘా ఉంటుంది.
● కొత్త పథకాల ప్రకటన, మౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి హామీలు ఇవ్వకూడదు. అధికారిక వాహనాల వినియోగంపై పరిమితులు ఉంటాయి.
● నగదు రవాణా విషయంలో బంగారం, వడ్డీ, బ్యాంకింగ్‌ అధికారులతోపాటు సామాన్యులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికీ కావాల్సిన ఇన్వాయిస్‌, బిల్లులు దగ్గర పెట్టుకోవాలి.
● లైసెన్స్‌డ్‌ ఆయుధాలన్నీ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సరెండర్‌ చేయాలి. ప్రార్థనా స్థలాల వద్ద ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు.
● ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఎలాంటి కానుకలు, డబ్బు, మద్యం పంచకూడదు.
● రాజకీయ విమర్శలు చేసే క్రమంలో వర్గాన్ని, నాయకుడిని ఉద్దేశిస్తూ.. విద్వేష వ్యాఖ్యలు చేయరాదు.
● ర్యాలీలు, సభల విషయంలో అధికా రుల అనుమతి తీసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement